Share News

దారుణం.. 100 మీటర్లకు పైగా మహిళను ఈడ్చుకెళ్లిన దొంగలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 13 , 2026 | 03:28 PM

అస్సాంలోని గువాహటిలో చైన్ స్నాచర్లు బరితెగించారు. బంగారు గొలుసు కోసం ఓ మహిళను ఏకంగా 100 మీటర్లకు పైగా రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

దారుణం.. 100 మీటర్లకు పైగా మహిళను ఈడ్చుకెళ్లిన దొంగలు.. వీడియో వైరల్
Guwahati Chain Snatching

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని గువాహటిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కాలిగాబరా ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను స్కూటీపై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళ కిందపడిపోగా.. గొలుసు కోసం ఆమెను రోడ్డుపై సుమారు 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళను పట్టించుకోకుండా గొలుసును లాక్కున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.


మహిళల భద్రతపై ఆందోళన..

బంగారు గొలుసు కోసం మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లడం స్థానికంగా భయాందోళనలకు కారణమైంది. స్కూటీలు, బైక్‌లపై వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘దేశంలో పట్టపగలు ఆడవాళ్లకు భద్రత లేకుండా పోయింది.. ఇదే నిజం’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఆమె ప్రాణాల కన్నా.. దొంగలకు బంగారం ఎక్కువైంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే.. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, నిందితుల గుర్తింపు, పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.


ఇవీ చదవండి

ఇంచ్‌ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్ వీడియో

Updated Date - Oct 13 , 2026 | 04:03 PM