సెన్సార్ శబ్దం భరించలేకపోయాడు.. కారును తగలబెట్టాడు! వీడియో వైరల్
ABN , Publish Date - Oct 30 , 2026 | 07:44 AM
కారు సెన్సార్ నుంచి పదేపదే వస్తున్న శబ్దం ఓ వ్యక్తికి తీవ్ర అసహనం కలిగించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు ఏకంగా పొరుగువారి కారుకే నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా కారు మంటల్లో కాలిపోతుండగా తన మొబైల్లో వీడియో కూడా తీశాడు.
ఇంటర్నెట్ డెస్క్: కారు సెన్సార్ నుంచి పదేపదే వస్తున్న శబ్దంతో విసుగు చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా ఆ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా కారు మంటల్లో కాలిపోతుండగా తన మొబైల్లో వీడియో కూడా తీశాడు. గుజరాత్లోని మోర్బి వాఘ్పారా ప్రాంతంలో అక్టోబర్ 28న ఈ ఘటన చోటుచేసుకుంది. శిఖర్ గోహెల్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పుష్పా భట్ అనే న్యాయవాదికి చెందిన మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఇంటి సమీపంలో పార్క్ చేసి ఉండగా.. శిఖర్ గోహెల్ పెట్రోల్ బాటిల్తో నిప్పంటించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు మంటల్లో కాలిపోతుండగా తన ఫోన్లో వీడియో తీసినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. కారు సెన్సార్ పదేపదే శబ్దం చేయడంతో విసుగు చెంది ఈ చర్యకు పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమై సుమారు రూ.3.50 లక్షల నష్టం వాటిల్లింది. బాధితురాలి ఫిర్యాదుతో మోర్బి ఎ డివిజన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘బయట కారు పార్క్ చేసి సౌండ్ పెడితే ఇలాగే ఇరిటేషన్ ఉంటుంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘కారు ఓనర్ తో మాట్లాడితే సమస్య తీరేది.. అన్యాయంగా కారుకు నిప్పు పెట్టాడు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘కారు బయట పార్క్ చేస్తే రక్షణ లేకుండా పోతుంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు