అదుర్స్.. మన దేశానికి ప్రస్తుతం కావాల్సిందిదే!
ABN , Publish Date - Feb 24 , 2026 | 02:08 PM
ఓ తండ్రి తన రెండేళ్ల తనయుడికి పౌరస్పృహ నేర్పిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ తండ్రి తన రెండేళ్ల తనయుడికి పౌర స్పృహ, క్రమశిక్షణ నేర్పిన వీడియోపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది (Father teaches toddler Civic Sense).
తన కొడుకుకు క్రమశిక్షణ ఎలా నేర్పించిందీ చెబుతూ దీపక్ సమల్ అనే వ్లాగర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇటీవల ఓ రోజు రైల్లో వెళుతుండగా రెండేళ్ల వయసున్న తన కొడుకు చిప్స్‌ను రైల్లో చెల్లాచెదురుగా పడేశాడని అన్నారు. తానే వాటిని ఎత్తి శుభ్రం చేద్దామనుకున్నప్పటికీ మనసు మార్చుకుని తన బిడ్డకు క్రమశిక్షణ నేర్పించే ప్రయత్నం చేశానని అన్నారు.
‘కింద పడ్డ చిప్స్‌ను నేనే ఎత్తి కవర్‌లో వేద్దామని క్షణకాలం పాటు అనిపించింది. నేనైతే నిమిషంలో ఆ పని చేసేవాడిని. కానీ అది పద్ధతి కాదనిపించింది. అందుకే నా బిడ్డకు జరిగిన తప్పు గురించి అర్థమయ్యేలా వివరించాను. అది మన ఇల్లు కాదని చెప్పా. ట్రెయిన్ అందరిదీ అని చెప్పాను. కాబట్టి నువ్వే వాటిని ఎత్తి మళ్లీ కవర్‌లో పెట్టాలని అన్నాను. వాడు క్షణ కాలం పాటు తికమకపడ్డాడు. ఆలోచించాడు. ఆపై కిందున్న చిప్స్‌ను జాగ్రత్తగా తీసి కవర్‌లో పెట్టాడు.
‘వాడిపై ఒక్క దెబ్బకూడా వేయలేదు. కనీసం అరవలేదు. చక్కగా నచ్చచెప్పా. ఈ చిన్న గుణపాఠం వాడి మనసులో తప్పకుండా నాటుకుపోతుంది. పరిశుభ్రత, పౌర స్పృహ అనేది చేతల ద్వారా నేర్పించాలి. రోజువారి ఎదురయ్యే ఘటన నుంచి నేర్చుకోవాలి’ అని అన్నారు.
ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పట్టారు. దేశానికి ప్రస్తుతం కావాల్సింది ఇదేనని అనేక మంది కామెంట్ చేశారు. సమల్ తీసుకున్న చర్య అభినందనీయమని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
ఈ వార్తలూ చదవండి:
చలిలో వణుకుతున్న కుక్కకు దుప్పటి కప్పాడని జాబ్‌లోంచి తీసేశారు!
స్పృహ తప్పి పడిపోయిన వధువు! పెళ్లి రద్దు చేసుకున్న వరుడి ఫ్యామిలీ