Share News

ఇంటర్వ్యూకు వెళ్తున్న కొడుకు.. అంతలో ఆ తండ్రి ఏం చేశాడంటే.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 08 , 2026 | 07:58 AM

స్కూల్, కాలేజీలలో ఫైనల్ పరీక్షలు రాసేటప్పుడు ఎవరికైనా టెన్షన్‌గానే ఉంటుంది. మనం చదివిన ప్రశ్నలు వస్తాయో? లేదో? ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో అనే ఓ టెన్షన్ ఉంటుంది.

ఇంటర్వ్యూకు వెళ్తున్న కొడుకు.. అంతలో ఆ తండ్రి ఏం చేశాడంటే.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: స్కూల్, కాలేజీలలో ఫైనల్ పరీక్షలు రాసేటప్పుడు ఎవరికైనా టెన్షన్‌గానే ఉంటుంది. మనం చదివిన ప్రశ్నలు వస్తాయో? లేదో? ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో అనే ఓ టెన్షన్ ఉంటుంది. ఇక ప్రభుత్వ కొలువు సాధించాలంటే.. అందుకోసం నిర్వహించే పరీక్షల్లో కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఆ పరీక్షలన్ని పాసై.. చివరి దశ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసినట్లే. ఈ పరీక్షలు పాస్ కావడం ఓ ఎత్తు.. ఇంటర్వ్యూలో సక్సెస్ కావడం మరో ఎత్తు. ఈ సమయంలో చాలా ఒత్తిడి ఉంటుంది.


ఇంటర్వ్యూలో ఎంత మంది ఉంటారో? వారు ఏం ప్రశ్నలు అడుగుతారో? అనే ఆందోళన ఉంటుంది. అలాంటి సమయంలో మన ఒత్తిడిని మటుమాయం చేసే వాళ్లు ఏవరైనా మనతో ఉంటే.. ఇంటర్వ్యూలో కూడా ఇట్టే నెగ్గేస్తాం. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వీడియోలో.. ఓ యువకుడు సూట్, బూటు వేసుకుని టై కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతడు ఎదురుగా ముసలి వ్యక్తి తెల్ల చొక్కా వేసుకుని ఉన్నాడు. ఆయన తన సంచిలో నుంచి దువ్వెన తీసి.. కుమారుడి తలను దువ్వాడు.


ఆ తర్వాత కుమారుడి చేతిలో స్వీట్ పెట్టాడు. అది అతడు నోట్లో వేసుకుని.. తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. కుమారుడి వీపు మీద చెయ్యి వేసి ఆ తండ్రి ఆశీర్వదించాడు. అనంతరం అతడు ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్సీ) పరీక్షల్లో ఉత్తర్ణత సాధించి.. ప్రయాగ్ రాజ్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూకు ఆ యువకుడు హాజరయే సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మీ నాన్నగారి ఆశీస్సులు ఉంటే, ప్రపంచంలో ఏ పరీక్ష కూడా కష్టంగా అనిపించదని పేర్కొన్నారు. కొడుకు విజయంపై తండ్రికి ఉన్న ఆత్మవిశ్వాసం ఆయన కళ్లలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఇదే భారతదేశ సంస్కృతి అని మరొకరు అభివర్ణించారు.

Updated Date - Oct 08 , 2026 | 08:17 AM