Share News

EPFO: వేతన పరిమితి పెంచే ఛాన్స్.. PF పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు!

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:27 PM

ప్రైవేట్ సెక్టార్, ఇంకా కవర్ అయిన పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదొక శుభవార్త. రూ.15,000 మించి బేసిక్ శాలరీ ప్లస్ డీఏ పొందుతున్న వారికి కూడా సామాజిక భద్రత చేకూర్చే అవకాశం కనిపిస్తోంది.

EPFO:  వేతన పరిమితి పెంచే ఛాన్స్.. PF పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు!
PF Salary Limit Hike

ఆంధ్రజ్యోతి, జనవరి 7: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు రావడానికి మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం నెలవారీ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ రూ.15,000 లోపు ఉన్నవారికే తప్పనిసరి పీఎఫ్ కవరేజీ ఉంది.

ఈ పరిమితి 2014 నుంచి మారలేదు. దాదాపు 11 సంవత్సరాలుగా ఇది స్థిరంగా ఉంది. తాజాగా దీని మీద సుప్రీంకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, EPFOని ఈ వేతన సీలింగ్‌ను సవరించే అంశంపై నాలుగు నెలల్లో(మే 2026లోపు) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.


దీనికి సంబంధించిన ఒక పిటిషన్‌పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రూ.15,000 బేసిక్ జీతం పరిమితి వల్ల చాలామంది మధ్య తరగతి ఉద్యోగులు సామాజిక భద్రత నుంచి దూరమవుతున్నారని పిటీషనర్లు వాదించారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించి పైవిధంగా ఆదేశాలిచ్చింది.

ఎంత మేరకు పెంచే అవకాశం?

ఉద్యోగ సంఘాలు బేసిక్ శాలరీ పరిమితిని రూ.21,000 నుంచి రూ.30,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పరిమితిని రూ.25,000 వరకు పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అమలైతే, లక్షలాది (దాదాపు ఒక కోటి పైగా) మంది అదనపు ఉద్యోగులు తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చి, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ వంటి లాంగ్ టర్మ్ భద్రత పొందుతారు.


ప్రయోజనాలు ఏమిటి?

  • మరింత మంది ఉద్యోగులకి రిటైర్మెంట్ సేవింగ్స్ పెరుగుతాయి.

  • పెన్షన్ స్కీమ్ (EPS) కవరేజీ మరింతమందికి విస్తరిస్తుంది.

అయితే, ఎంప్లాయర్-ఎంప్లాయీ కంట్రిబ్యూషన్స్ పెరిగి, టేక్-హోమ్ శాలరీ కొంచెం తగ్గవచ్చు (ఎక్కువ జీతం ఉన్న వాళ్లకు).

కాగా.. ప్రస్తుతానికి రూ.15,000 లోపు బేసిక్ శాలరీ పరిమితి కొనసాగుతోంది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల మార్పు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 2026 బడ్జెట్‌‌లో లేదా అంతకుముందే కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చు. ఈ పరిమితి పెంపు వల్ల మరింత మంది ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది.


ఇవి కూడా చదవండి..

వెనెజువెలాలో మారణహోమం సృష్టించిన అమెరికా ఆపరేషన్..

ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు.. నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు..

Updated Date - Jan 07 , 2026 | 03:46 PM