Share News

ఎయిర్‌హోస్టస్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ప్రయాణికుడు

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:04 PM

ఎయిర్‌హోస్టస్‌ను ఓ ప్రయాణికుడు ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆమెకు స్పెషల్ బహుమతిని ఇచ్చినందుకు అతడిని జనాలు అభినందించారు.

ఎయిర్‌హోస్టస్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ప్రయాణికుడు
Emirates air hostess viral video

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ప్రయాణికులు విమానం దిగే ముందు సిబ్బందికి ధన్యవాదాలు చెబుతారు. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఏదైనా చేద్దామని ఆలోచించాడు. అతడి ప్రయత్నం ఫలించడంతో ఎయిర్‌హోస్టెస్ ముఖంలో నవ్వులు విరిశాయి. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

వివేక్ పాటిల్ అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఎయిర్ హోస్టస్‌ ముఖంలో నవ్వులు చిందేలా చేయాలని అనుకున్నాను. అందుకోసం పెన్ను, పేపర్ చేతబట్టాను. నా ప్రయత్నం ఫలించింది. ఆమె రియాక్షన్ నాకు మరిచిపోలేని గుర్తును మిగిల్చింది. ఈ వీడియో ఎప్పటికైనా ఆమెకు చేరుతుందని అనుకుంటున్నా’ అంటూ వీడియోను షేర్ చేశారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ను కూడా ట్యాగ్ చేశారు.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఎయిర్‌హోస్టస్‌కు తెలియకుండా పాటిల్ తన వద్ద ఉన్న పేపర్, పెన్నును ఆమె చిత్రాన్ని గీయడం ప్రారంభించాడు. ఆమె ప్రతి ముఖకవళికను జాగ్రత్తగా గమనిస్తూ చిత్రాన్ని గీశాడు. ఆమె ఇంటర్‌కామ్‌లో ప్రయాణికులకు సూచనలిస్తున్నప్పుడు, ప్యాసింజర్లకు కావాల్సినవి అందిస్తున్నప్పుడు.. ఇలా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించి చక్కటి చిత్రాన్ని వేశాడు.

ఇక విమానం లాండయ్యాక అందరూ దిగిపోతున్న సమయంలో ఆ ఎయిర్‌హోస్టస్‌ను ఊహించని రీతిలో సర్‌ప్రైజ్ చేశాడు. ఆయన గీసిన చిత్రాన్ని చూసిన వెంటనే క్షణాల్లో ఆమె ముఖంలో సంబరం వెల్లివిరిసింది. ప్యాసింజర్‌కు ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు.

ఈ వీడియోకు నెటిజన్లు కూడా బ్రహ్మరథం పట్టారు. ఎయిర్‌హోస్టస్ చిత్రాన్ని అద్భుతంగా గీసినందుకు ప్రశంసలు కురిపించారు. కేవలం ధన్యవాదాలతో సరిపెట్టకుండా ఇలా స్పెషల్‌గా ఆమె శ్రమను గుర్తించి ప్రశంసించినందుకు అభినందించారు. మరి ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేంయండి.


ఈ వార్తలూ చదవండి:

ఈమె తల్లేనా.. కన్న బిడ్డను నడిరోడ్డుపై దారుణంగా..

ఓం నమః శివాయః.. కొరియన్ సింగర్ పోస్టు వైరల్

Updated Date - Feb 17 , 2026 | 08:01 PM