Share News

ఇనుము నుంచి విద్యుత్‌!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:43 AM

రోజురోజుకు తగ్గిపోతున్న బొగ్గు నిల్వలు.. థర్మల్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బందులు.. బొగ్గు మండిస్తే వెలువడే కాలుష్యంతో పర్యావరణానికి తీవ్రనష్టం.. మరోవైపు సౌర, పవన విద్యుత్‌ వంటి సాంప్రదాయేతర విద్యుత్‌ అందుబాటులో లేని సమయాల్లో డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ సరఫరా కూడా సవాలే

ఇనుము నుంచి విద్యుత్‌!
iron image

  • ఇప్పుడున్న థర్మల్‌ ప్లాంట్లలోనే స్వల్ప మార్పులతో వినియోగించే అవకాశం

  • థర్మల్‌ కలుషితాల నుంచి విముక్తిజర్మనీ శాస్త్రవేత్తల పరిశోధన

(సెంట్రల్‌ డెస్క్‌)

రోజురోజుకు తగ్గిపోతున్న బొగ్గు నిల్వలు.. థర్మల్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బందులు.. బొగ్గు మండిస్తే వెలువడే కాలుష్యంతో పర్యావరణానికి తీవ్రనష్టం.. మరోవైపు సౌర, పవన విద్యుత్‌ వంటి సాంప్రదాయేతర విద్యుత్‌ అందుబాటులో లేని సమయాల్లో డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ సరఫరా కూడా సవాలే. ఈ సమస్యలన్నింటికీ ఒక్క సాంకేతికతతో పరిష్కారం చూపేదిశగా జర్మనీకి చెందిన కార్ల్‌స్రూహే వర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గుకు బదులుగా ఇనుప పొడి(ఐరన్‌ డస్ట్‌)ను వినియోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధానానికి అంకురార్పణ చేశారు. పాత థర్మల్‌ ప్లాంట్లలో స్వల్ప మార్పులు చేస్తే చాలని.. ఎలాంటి విష వాయవులు వెలువడవని వారు చెబుతున్నారు. అంతేకాదు ప్లాంటులో మండిపోయి మిగిలే ఐరన్‌ ఆక్సైడ్‌ (తుప్పు)ను మళ్లీ ఇనుప పొడిగా మార్చి వినియోగించుకోవచ్చని అంటున్నారు.

ఇనుముతోనే ఎందుకు?

పొడి రూపంలో ఉన్నప్పుడు ఇనుము సహా చాలా లోహాలకు తగిన ఉష్ణోగ్రత అందితే మండిపోయి శక్తిని వెలువరిస్తాయి. అలా మండినప్పుడు గాలిలోని ఆక్సిజన్‌, ఇతర రసాయనాలతో చర్య జరిపి ఖనిజ సమ్మేళనాలుగా మారుతాయి. వాటిని తిరిగి లోహంగా పూర్వస్థితికి తీసుకురావడం కొంత కష్టం. కానీ ఐరన్‌ ఆక్సైడ్‌గా మారే ఇనుమును పూర్వస్థితికి తీసుకురావడం కాస్త సులువు. అందుకే కార్ల్‌స్రూహే వర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు ఇనుమును ఎంచుకున్నారు. థర్మల్‌ కేంద్రాల్లోని బాయిలర్‌ తరహా చిన్నపాటి వ్యవస్థను ల్యాబ్‌లో ఏర్పాటు చేసి.. ప్రయోగాత్మకంగా ఇనుప పొడిని మండించారు. దాని నుంచి వెలువడిన శక్తి, ఇతర అంశాలను పరిశీలించారు. ఇనుము మండిపోయి ఏర్పడిన ఐరన్‌ ఆక్సైడ్‌ను హైడ్రోజన్‌ సాయంతో తిరిగి ఇనుముగా మార్చారు. అంటే ఇది ఒకరకంగా పునరుత్పాదక ఇంధనమే.


ఇప్పుడున్న థర్మల్‌ ప్లాంట్లలోనే

ఇప్పుడున్న థర్మల్‌ ప్లాంట్లలోనే ఇనుప పొడి వినియోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని... ప్లాంట్లలోని బాయిలర్లు, ధూళి ఫిల్టర్లు వంటి కొన్నింటిలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని జూలియా షూలర్‌ తెలిపారు. గ్లోబల్‌ వార్మింగ్‌ ఆందోళనతో ప్రపంచవ్యాప్తంగా మూతపడుతున్న థర్మల్‌ ప్లాంట్లను ఈ విధానంలో మళ్లీ వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇనుప పొడితో థర్మల్‌ ప్లాంట్లలో నిలకడగా విద్యుదుత్పత్తికి వీలుంటుందని తెలిపారు. ప్రస్తుతం కాలుష్య రహిత ప్రత్యామ్నాయాలుగా తెరపైకి వచ్చిన హైడ్రోజన్‌ పవర్‌ ప్లాంట్లు, బ్యాటరీ విద్యుత్‌ స్టోరేజీ ప్లాంట్లు, హైడ్రోజన్‌ నిల్వ వంటివాటితో పోలిస్తే.. ఇనుప పొడి ఆధారిత థర్మల్‌ విద్యుదుత్పత్తికి చాలా తక్కువ ఖర్చవుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ విధానంలో... ఇనుప పొడి ఉత్పత్తి, థర్మల్‌ ప్లాంట్లను ఇనుప పొడితో పనిచేసేలా మార్చేందుకు ఏమేర మార్పులు అవసరం, ఐరన్‌ ఆక్సైడ్‌ను తిరిగి ఇనుముగా మార్చేందుకు అయ్యే వ్యయం వంటివి కీలకమని వెల్లడించారు.

కాలుష్య రహితం కూడా..

థర్మల్‌ ప్లాంట్లలో బొగ్గు వినియోగంతో కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి పలురకాల విషవాయువులు వెలువడతాయని.. కానీ ఇనుపపొడి వినియోగంతో ఎలాంటి విష వాయువులు వెలువడలేదని వర్సిటీలోని ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ విభాగం శాస్త్రవేత్త జూలియా షూలర్‌ వెల్లడించారు. అంతే కాకుండా ఈ ప్రక్రియలో ఇనుప పొడిని పునర్వినియోగ ఇంధనంగా వాడుకోవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి..

వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 12 , 2026 | 05:45 AM