యువతి వింత ప్రవర్తన.. ఎవరో చెయ్యి పట్టుకుని తీసుకెళుతున్నట్లు..
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:56 PM
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువతి కనిపించకుండా పోవటం మిస్టరీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై, ఏప్రిల్ 18: మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువతి కనిపించకుండా పోవటం మిస్టరీగా మారింది. ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంజీవని రాహుల్ వరాదె.. సహజీవన్ నగర్ ఏరియాలోని ప్రభుత్వ మిల్క్ డెయిరీ సమీపంలో చివరి సారిగా కనిపించింది. అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లింది? ఏమైందన్నది మిస్టరీగా మిగిలింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు సంజీవని చివరిసారిగా కనిపించిన ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. సంజీవని ఓ చోట నిల్చుని ఉంది. కొద్దిసేపటి తర్వాత ఓ వృద్ధుడు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. అతడు అక్కడినుంచి వెళ్లిపోయిన కొన్ని సెకన్లకే సంజీవని వింతగా ప్రవర్తించటం మొదలెట్టింది. ఎడమ చెయ్యి గాల్లోకి లేపింది. ఎవరో ఆమె చెయ్యి పట్టుకుని అక్కడినుంచి తీసుకెళుతున్నట్లు వెళ్లిపోయింది.
వైరల్‌గా మారిన వీడియోలో ఆ యువతి ప్రవర్తన పోలీసులకు కూడా అంతుచిక్కకుండా ఉంది. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ యువతిని ఎవరో హిప్నటైజ్ చేసి ఉంటారు. అందుకే ఆమె అలా వింతగా ప్రవర్తిస్తూ ఉంది’..‘ఆ అమ్మాయికి కచ్చితంగా దెయ్యం పట్టి ఉంటుంది. లేదంటే దెయ్యమే ఆమెను తీసుకెళ్లి ఉంటుంది. రెండు రోజులు అయినా యువతి ఆచూకీ దొరకలేదంటే అది కచ్చితంగా మానవాతీత శక్తుల పనే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!