Share News

వైరల్‌గా మారిన దేశీ బ్యాట్‌మ్యాన్‌.. ఇన్‌స్టాలో దుమ్మురేపుతున్న వీడియోలు..

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:40 PM

గోతమ్ సిటీలో అత్యాధునిక బాట్‌మొబైల్‌పై దూసుకెళ్లే బ్యాట్‌మ్యాన్‌.. ఇప్పుడు భారతీయ పల్లెటూరి బాట పట్టాడు. బాట్‌మొబైల్‌ను పక్కనపెట్టి గేదెపై స్వారీ చేస్తూ పల్లెటూరి వీధుల్లో సందడి చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన ఏఐ క్రియేటర్ సుజల్ జైస్వార్ రూపొందించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్‌గా మారిన దేశీ బ్యాట్‌మ్యాన్‌.. ఇన్‌స్టాలో దుమ్మురేపుతున్న వీడియోలు..
Desi Batman

ఇంటర్నెట్ డెస్క్: గోతమ్ సిటీలో అత్యాధునిక బాట్‌మొబైల్‌పై దూసుకెళ్లే బ్యాట్‌మ్యాన్‌.. ఇప్పుడు భారతీయ పల్లెటూరి బాట పట్టాడు. బాట్‌మొబైల్‌ను పక్కనపెట్టి గేదెపై స్వారీ చేస్తూ పల్లెటూరి వీధుల్లో సందడి చేస్తున్నాడు. అంతేకాదు.. ఈ దేశీ బ్యాట్‌మ్యాన్‌ సాహసాలకు మాధురీ దీక్షిత్‌ నటించిన ‘సాజన్ సాజన్ తేరీ దుల్హన్’ పాటను జత చేయడంతో ఈ వీడియోలు మరింత ఆసక్తికరంగా మారాయి. బెంగళూరుకు చెందిన ఏఐ క్రియేటర్ సుజల్ జైస్వార్ రూపొందించిన ఈ వినూత్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


వైరల్ అయిన ఓ వీడియోలో దేశీ బ్యాట్‌మ్యాన్‌ రైల్వే ట్రాక్ పక్కన పళ్లు తోముకుంటూ కనిపిస్తాడు. అదే సమయంలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడంటూ గ్రామంలో పోస్టర్లు కనిపిస్తాయి. మరోవైపు, రిక్షాలో ప్రయాణిస్తూ జోకర్ ఆ చిన్నారిని గుర్తిస్తాడు. అతనికి లాలిపాప్ ఆశ చూపించి కిడ్నాప్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న బ్యాట్‌మ్యాన్‌ వెంటనే తన సూట్ ధరించి విలన్‌ను పట్టుకునేందుకు బయలుదేరుతాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. తనకు ఎప్పుడూ తోడుగా ఉండే బాట్‌మొబైల్‌ (బ్యాట్‌మ్యాన్‌ కారు)ను కాకుండా ఓ గేదెను తన వాహనంగా ఎంచుకుంటాడు. గేదెపై స్వారీ చేస్తూ జోకర్‌ను వెంబడించి, చివరకు బాలుడిని రక్షిస్తాడు. అనంతరం జోకర్‌తో తలపడతాడు.


సీరియస్‌గా సాగే సూపర్‌హీరో యాక్షన్‌కు పల్లెటూరి నేపథ్యం జతకావడంతో ఈ వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో విజువల్స్ ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో, వాటికి జత చేసిన పాట కూడా అంతే ఆసక్తికరంగా మారింది. 1999లో విడుదలైన ‘ఆర్జూ’ సినిమాలో మాధురీ దీక్షిత్‌ నటించిన ‘సాజన్ సాజన్ తేరీ దుల్హన్’ పాటను రీమిక్స్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించారు. సాధారణంగా బ్యాట్‌మ్యాన్‌ వీడియోలకు ఉత్కంఠభరితమైన సంగీతం వినిపిస్తుంటుంది. కానీ ఇక్కడ మాత్రం రొమాంటిక్ బాలీవుడ్ పాటను ఉపయోగించడం కొత్తదనాన్ని తీసుకొచ్చింది. బ్యాట్‌మ్యాన్‌ సీరియస్ యాక్షన్‌కు మాధురీ పాట జతకావడంతో ఈ కాంబినేషన్ నెటిజన్లకు వినోదాన్ని పంచుతోంది.


ఈ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్‌గా మారాయి. ఈ మొత్తం సిరీస్ సుమారు రెండు వారాల్లోనే 2.5 కోట్లకు పైగా వ్యూస్ సాధించగా.. అత్యంత ప్రజాదరణ పొందిన ఓ వీడియో ఏకంగా 1.7 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ ట్రెండ్‌ను చూసి ఇతర కంటెంట్ క్రియేటర్లు కూడా అదే ఆడియోతో తమదైన శైలిలో వీడియోలు రూపొందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెళ్లిలో కోటి రూపాయల నగదు దండలు.. వరులకు బావ భారీ కానుక

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 24 , 2026 | 05:46 PM