Share News

కొంప ముంచిన ప్రాంక్.. అడ్డంగా బుక్కైన కారు ఓనర్..

ABN , Publish Date - Mar 30 , 2026 | 07:38 AM

ఓ బాలుడు ఫ్లైఓవర్‌పై ప్రాంక్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న బైకర్లపై కారులోంచి వాటర్ బెలూన్లు విసిరాడు. పిల్లాడు చేసిన తప్పునకు కారు ఓనర్ అడ్డం బుక్కయ్యాడు. పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు.

కొంప ముంచిన ప్రాంక్.. అడ్డంగా బుక్కైన కారు ఓనర్..
Delhi viral video

న్యూఢిల్లీ, మార్చి 30: ఈ మధ్య కాలంలో పబ్లిక్ ప్లేస్‌లలో ప్రాంక్‌లు చేయటం బాగా పెరిగిపోయింది. సరదా కోసమో.. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసమో.. కొంత మంది ప్రాంక్‌‌ల పేరిట పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు. తోటి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా, ఓ బాలుడు ఫ్లైఓవర్‌పై ప్రాంక్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న బైకర్లపై కారులోంచి వాటర్ బెలూన్లు విసిరాడు. పిల్లాడు చేసిన తప్పునకు కారు ఓనర్ అడ్డం బుక్కయ్యాడు. పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మార్చి 27వ తేదీన భలస్వా ఫ్లైఓవర్‌పై ఓ కారు వెళుతోంది. ఆ కారులోని వెనుక సీటులో కూర్చున్న బాలుడు వాటర్ బెలూన్లను ఆ రోడ్డుపై వెళ్లే బైకర్లపై విసరటం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఓ బైకర్‌పై వాటర్ బెలూన్ విసిరాడు. దీంతో బైక్ అదుపుతప్పింది. పక్కనే ఉన్న సేఫ్టీ వాల్‌ను తగిలి వేగంగా ముందుకు దూసుకుపోయింది. కొంచెం ఉంటే బైక్ రోడ్డుపై కుప్పకూలిపోయేది. బైకర్ అదృష్టం బాగుండి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దివ్య గడోత్ర ఠండన్ అనే యువతి తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.


రోడ్డుపై ప్రాంక్‌లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులను కోరింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఢిల్లీ పోలీస్ అధికారుల దృష్టికి వెళ్లింది. ఢిల్లీ పోలీసులు ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు కారు యజమానిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీస్ శాఖ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రాంక్‌లు చేయడానికి రోడ్లు వేదిక కాదని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

రైల్వేలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం.. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..

Updated Date - Mar 30 , 2026 | 07:53 AM