Share News

రైల్వేలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం.. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 30 , 2026 | 07:27 AM

రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించే దిశగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల ప్రకటనలను రైల్వే స్టేషన్ల పరిధిలో గానీ, రైలు బోగీలపై కానీ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ రైల్వేశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

రైల్వేలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం.. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం
Indian Railways

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించే దిశగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం(Alcohol), పొగాకు ఉత్పత్తులు (Tobacco products), సిగరెట్ల ప్రకటనలను రైల్వే స్టేషన్ల పరిధిలో గానీ, రైలు బోగీలపై కానీ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ రైల్వేశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే శాఖకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అన్ని జోనల్ రైల్వే కార్యాలయాలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, తక్షణమే ఇటువంటి ప్రకటనలను తొలగించాలని రైల్వేశాఖ సూచించింది.


రైల్వే శాఖకు ఇలాంటి వాణిజ్య ప్రకటనల ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఆదాయం కన్నా ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే, చట్టపరంగా అభ్యంతరకరంగా ఉన్న వస్తువుల ప్రచారాన్ని అరికట్టడం కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే‌శాఖ సూచించింది. ఇక నుంచి సిగరెట్లు, బీడీలు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులతో పాటూ అన్ని రకాల మద్యపాన బ్రాండ్ల యాడ్స్ రైల్వే స్టేషన్‌లలోని డిజిటల్ స్క్రీన్లు, హోర్డింగ్స్‌పై కనిపించవు. అయితే, ఈ నిషేధం కేవలం ప్రత్యక్ష ప్రకటనలకే మాత్రమే కాకుండా.. పరోక్షంగా ప్రదర్శించే ‘సర్రోగేట్ అడ్వర్టైజింగ్’పై కూడా ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది.


రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణం కొనసాగిస్తుంటారు. రైల్వే ప్రాంగణంలో హానికరమైన అలవాట్లను ప్రేరేపించే ఫొటోలు, వీడియోల ప్రదర్శన వల్ల వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైల్వేశాఖ అభిప్రాయపడింది. పొగాకు, గుట్కా వాడకం వల్ల రైల్వే ఫ్లాట్‌ఫామ్స్, రైళ్లలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త రూల్స్‌ని ఉల్లంఘించే సదరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై రైల్వేశాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. భారీ జరిమానాలు విధించడమే కాదు, ఆ ఏజెన్సీల కాంట్రాక్టులను రద్దు చేసే అధికారం జోనల్ అధికారులకు ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం... విజయ్ ఎన్నికల మేనిఫెస్టో

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్..

Updated Date - Mar 30 , 2026 | 07:47 AM