ఎయిర్‌పోర్టు అధికారి చెప్పినా వినని ప్యాసింజర్.. చివరకు షాక్
ABN , Publish Date - Mar 20 , 2026 | 02:44 PM
ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ అధికారి చెప్పినా వినకుండా క్యాబ్ ఎక్కినందుకు మోసపోయానంటూ ఓ ప్యాసింజర్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారి చెప్పిన మాటను పట్టించుకోకుండా మోసపోయానంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ తనను మోసం చేసి డబ్బులు దండుకున్నాడని ఆ వ్యక్తి తెలిపారు.
ఢిల్లీలో మూడో టర్మినల్ నుంచి రెండో టర్మినల్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కి భారీ పొరపాటు చేశానని ఆ ప్యాసింజర్ విచారపడ్డారు. మూడో టర్మినల్ వద్ద సీఐఎస్ఎఫ్ అధికారి సలహాను పాటించి ఉంటే అగత్యం తప్పిఉండేదని అన్నారు.
‘విమానం ఎక్కేందుకు నేను రెండో టర్మినల్‌కు వెళ్లాలి. కానీ పొరపాటున మూడో టర్మినల్ వరకూ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లాను. కానీ, అక్కడి సీఐఎస్ఎఫ్ సిబ్బంది నాకు ఎంతో సహకరించారు. పైఅంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లి అక్కడి నుంచి కాలినడకన రెండో టర్మినల్‌కు వెళ్లాలని సూచించారు’

‘ఇంతలో ఒక క్యాబ్ డ్రైవర్ వచ్చి నన్ను కారులో అక్కడ దింపుతానని అన్నాడు. కాలినడకన వెళితే 20 నుంచి 30 నిమిషాలు పడుతుందని అన్నాడు. క్యాబ్‌లో వెళితేనే బెటర్ అని సూచించాడు. ఓలాలో ఎంత ఛార్జీ చూపిస్తే అంతే ఇవ్వమని కోరాడు. నేను అతడి మాటలు నమ్మాను. రూ.200లకు మించి కాదనుకుని క్యాబ్ ఎక్కాను. కానీ మార్గమధ్యంలో డ్రైవర్ రూ.650 ఇవ్వమని డిమాండ్ చేశాడు. నాకు కోపం వచ్చినా తమాయించుకుని అతడితో బేరమాడి రూ.550 ఇచ్చాను. అయినా నేను దారుణంగా మోసపోయానని అనిపించింది. ఇది నాకు ఒక గుణ పాఠం. ఒక టర్మినల్ నుంచి మరో టర్మినల్‌కు వెళ్లేందుకు ఇకపై క్యాబ్ అస్సలు ఎక్కను. కుదిరితే కాలినడకనే వెళతాను. లేకపోతే ఎయిర్‌పోర్టు షటిల్ సర్వీసును ఉపయోగించుకుంటాను’ అని చెప్పారు.
ఈ పోస్టుకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది సాధారణంగా జరిగే ఘటన అని అనేక మంది కామెంట్ చేశారు. విమానం ఎక్కాలనే తొందరలో అనేక మంది ఇలాంటి పొరపాట్లు చేస్తారని అన్నారు. డ్రైవర్‌లు అడిగిన మేరకు డబ్బు చేతిలో పెట్టి మిన్నకుండిపోతారని చెప్పారు. షటిల్ సర్వీసుల కోసం వేచి చూడరన్నారు. ఎయిర్‌పోర్టులో టర్మినల్స్ మధ్య జర్నీలకు ఎట్టి పరిస్థితుల్లో క్యాబ్ వాడొద్దని సూచించారు.
ఇవీ చదవండి:
నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన రాఫ్టింగ్ బృందం.. వీడియో వైరల్
విరాట్ జెర్సీ కోసం చిన్నారి మంకుపట్టు.. వైరల్‌గా మారిన వీడియో..