వావ్.. భలే ఫ్లయ్యింగ్ కారు.. మస్క్‌ను మించిపోయారుగా..
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:27 AM
చైనాలో ఇటీవల పరీక్షించిన ఓ ఎగిరే కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో ఇటీవల పరీక్షించిన ఓ ఎగిరే కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన ఫ్లయ్యింగ్ కారుతో పోలిస్తే భిన్నమైన డిజైన్‌తో రూపొందించిన ఈ కారుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
చైనాలో స్వదేశీ సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ఈ కారుకు రెక్కలు ఉండవు. బయటకు కనిపించేలా రోటర్స్ కూడా ఉండవు. రన్ వే అవసరం అసలే లేదు. నేలపై నుంచి నిటారుగా ఎగిరి, అదే విధంగా లాండ్ కాగలదు. ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే కూర్చోగలిగేలా ఈ ప్రయోగాత్మక కారును డిజైన్ చేశారు. గరిష్ఠంగా 280 కేజీల బరువుతో ఇది గాల్లో ఎగరగలదు. 120 కేజీలు పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.
కారు ప్రత్యేకత ఏంటంటే..
సాధారణంగా ఎగిరే కార్లలో రోటర్ బ్లేడ్స్ ఉంటాయి. ఇవి బయటకు కనిపించేలా ఉంటాయి. అయితే, చైనా మాత్రం ఇందుకు భిన్నమైన సాంకేతికతను వినియోగించింది. థ్రస్ట్ వెక్టరింగ్ డక్టెడ్ ఫ్యాన్ వ్యవస్థతో కారు గాల్లోకి ఎగిరేలా డిజైన్ చేసింది. ఈ వ్యవస్థ బయటకు కనిపించకుండా అమర్చారు. దీంతో, బయటి నుంచి చూస్తే ఇది సాధారణ కారులాగే కనిపిస్తుంది. ఈ డిజైన్‌తో ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుందని కారు డిజైనర్లు పేర్కొన్నారు. తొలి ప్రయోగం విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
నోట్ల కట్ట ఎదురుగా ఉన్నా.. ఒక్క రూ.500 నోటే చోరీ.. చివరికి..
తండ్రి కల కోసం 190 కి.మీ. ఈత.. రికార్డు సృష్టించిన స్వీడన్ మహిళ