Share News

చరిత్ర సృష్టించిన యువతి.. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్..

ABN , Publish Date - May 24 , 2026 | 07:36 AM

చైనాకు చెందిన ఓ యువతి సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించింది. అకౌంట్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.

చరిత్ర సృష్టించిన యువతి.. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్..
Jiang Chenglan

ఇంటర్‌నెట్ డెస్క్: దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 2024లో యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. యూట్యూబ్‌లో అకౌంట్ యాక్టీవ్‌లోకి రాగానే రికార్డ్ క్రియేట్ అయింది. రొనాల్డో 24 గంటల్లో దాదాపు 2 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్స్‌ను సొంతం చేసుకున్నారు. పాత రికార్డులను తుడిచిపెట్టారు. రొనాల్డో‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది కాబట్టి ఈ ఫీట్ సాధ్యం అయింది. అచ్చం రొనాల్డోలాగే చైనాకు చెందిన ఓ యువతి సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించింది. అకౌంట్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.


ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన బ్యూటీ మేకప్ ఇన్‌ఫ్లుయెన్సర్ జియాంగ్ చెంగ్లాన్ 2023 మే వరకు డౌయిన్ అనే వీడియో షేరింగ్ యాప్‌లో యాక్టీవ్‌గా ఉండేది. ఆమెకు డౌయిన్‌లో 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండేవారు. 2023 మే నుంచి ఆమె డౌయిన్‌ను వాడటం మానేసింది. ఆమె ఎందుకలా చేసిందో ఫ్యాన్స్‌కు అర్థం కాలేదు. మూడేళ్లు గడిపోయాయి. మే 13వ తేదీన ఆమె తన పేరుతో డౌయిన్‌లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మూడేళ్లు అయినా అభిమానులు ఆమెను మర్చిపోలేదు.
china-influencer.jpg


అకౌంట్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలో అవ్వటం మొదలెట్టారు. జియాంగ్ చెంగ్లాన్ రికార్డ్ సృష్టించిన నేపథ్యంలో స్థానిక మీడియా సంస్థలు ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘మూడేళ్ల క్రితం నా మాజీ ఏజెన్సీ షాంగై జిన్ జియా కంపెనీతో గొడవలు జరిగాయి. ఈ కారణంగానే నేను మూడేళ్ల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. పాత అకౌంట్ ‘చెంగ్షియాన్’ ట్రేడ్ మార్క్ వాళ్ల పేరు మీద ఉంది. అందుకే నా పేరు మీద కొత్త అకౌంట్ ఓపెన్ చేశా. పాత అకౌంట్ పేరు మీద ఉన్న షాపులు ఇప్పుడు నావి కావు. అభిమానులు నా మీద ఉన్న నమ్మకంతో ఆ షాపుల నుంచి ఎలాంటి ఆర్డర్లు పెట్టకండి’ అని చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

కృష్ణ జిల్లాలో పోలీసుల ఛేజింగ్.. గంజాయితో పట్టుబడ్డ యువకులు

Updated Date - May 24 , 2026 | 07:45 AM