బిక్షాటన కోసం మరీ ఇలా చేయడమేంటీ.. ఈ మహిళల నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:40 AM
స్కూలుకు పంపాల్సిన తమ పిల్లలను కొందరు మహిళలు.. ముఖాలపై గాయాలైనట్లుగా మేకప్ వేసి మరీ.. భిక్షాటనకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు పొద్దునే స్నానం చేయించి, మంచి దుస్తులు వేసి, తలను దువ్వి, పౌడర్ వేసి.. స్కూలుకు రెడీ చేస్తుంది తల్లి. అందంగా ముస్తాబైన పిల్లలకు దిష్టితీసి మరీ స్కూలుకు పంపిస్తుంది. అయితే అలాంటి తల్లి.. తన పిల్లల్ని బిక్షాటనకు సిద్ధం చేసి పంపితే.. పౌడర్‌కు బదులుగా గాయాలైనట్లుగా మేకప్ చేసి మరీ పంపితే... ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. అవును .. ఇది అక్షరాలా నిజం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
పిల్లలను బడికి పంపాల్సిన కన్నతల్లులే వారి ముఖాలపై నకిలీ గాయాల మేకప్ వేసి భిక్షాటనకు దింపుతున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిజమైన గాయాల్లా కనిపించేలా రంగులు, కాటన్, బ్యాండేజీలతో మేకప్ చేసి, ట్రాఫిక్ సిగ్నళ్లు, రద్దీ ప్రాంతాల్లో పిల్లలను భిక్షాటనకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా గాయాలతో ఉన్న చిన్నారులను చూస్తే జాలిపడి డబ్బులు ఇచ్చే ప్రజల మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు వైరల్ అవుతున్న దృశ్యాలు చూపిస్తున్నాయి. పిల్లలకు ఆ గాయాలను చూపిస్తూ ఎలా భిక్ష అడగాలో కూడా శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల బాల్యాన్ని, విద్యను, భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. భిక్షాటన వెనుక ఉన్న వ్యక్తులు, ముఠాలపై సమగ్ర విచారణ జరిపి, చిన్నారులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పసి పిల్లలను సంపాదన కోసం ఉపయోగించడం వారి హక్కులను కాలరాయడమేనని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్