పదేళ్ల తర్వాత తిరిగొచ్చిన పెంపుడు పిల్లి.. చిన్న మైక్రో చిప్‌తో..
ABN , Publish Date - Oct 09 , 2026 | 08:05 PM
పదేళ్ల కిందట కనిపించకుండా పోయిన ఓ పెంపుడు పిల్లి అనూహ్యంగా తిరిగి తన యజమానుల చెంతకు చేరింది. యజమాని 30వ పుట్టినరోజుకు ముందు ఈ శుభవార్త అందడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: పదేళ్ల కిందట కనిపించకుండా పోయిన ఓ పెంపుడు పిల్లి అనూహ్యంగా తిరిగి తన యజమానుల చెంతకు చేరింది. యజమాని 30వ పుట్టినరోజుకు ముందు ఈ శుభవార్త అందడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బ్రిటన్‌లోని వేల్స్‌కు చెందిన లూసీ రాబర్ట్‌సన్, హన్నా డేవిస్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఈ అరుదైన అనుభవం ఎదురైంది. వారి పెంపుడు పిల్లి చార్లీ 2016లో తప్పిపోయి, పదేళ్ల తర్వాత తిరిగి దొరికింది.
చార్లీకి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు, 2016 ఏప్రిల్‌లో అది కనిపించకుండా పోయింది. అప్పట్లో హన్నా న్యూబ్రిడ్జ్ నుంచి అబెర్‌కార్న్ ప్రాంతానికి ఇల్లు మారారు. బయట తిరగడం అలవాటున్న చార్లీ.. కొత్త ప్రాంతానికి వచ్చిన కొన్ని రోజులకే అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు నెలల తరబడి దాని కోసం వెతికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారించడంతో పాటు, సోషల్ మీడియాలోనూ సమాచారం పంచుకున్నారు. అయినప్పటికీ చార్లీ ఆచూకీ లభించలేదు. దీంతో తమ పెంపుడు పిల్లి ఇక తిరిగి రాదేమోనని వారు ఆవేదన చెందారు. అయితే, పదేళ్ల తర్వాత వారి నిరీక్షణకు తెరపడింది.
చార్లీ ప్రస్తుత వయసు 13 ఏళ్లు. ఇటీవల ఓ స్థానిక వ్యక్తికి అది పొదల్లో కనిపించింది. వీధి పిల్లి అని భావించిన అతడు కొన్ని వారాల పాటు ఆహారం అందిస్తూ చూసుకున్నాడు. అనంతరం దాన్ని పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చార్లీ శరీరంలో అమర్చిన మైక్రోచిప్‌ను స్కాన్ చేయడంతో దాని యజమానుల వివరాలు తెలిశాయి. దీంతో హన్నాను సంప్రదించి, చార్లీ దొరికిన విషయాన్ని తెలియజేశాడు పశువైద్యుడు. ఈ ఫోన్ కాల్ కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా లూసీ 30వ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త అందడం మరింత ప్రత్యేకంగా మారింది. పదేళ్ల కిందట తప్పిపోయిన తమ పిల్లి తిరిగి దొరుకుతుందని ఊహించలేదని వారు సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఇన్నేళ్ల తర్వాత కూడా చార్లీ ఆరోగ్యంగానే ఉండటం పశువైద్యుడిని ఆశ్చర్యపరిచింది. దానికి ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కనిపించలేదని కుటుంబ సభ్యులూ తెలిపారు. అయితే, ఈ పదేళ్ల పాటు చార్లీ ఎక్కడ ఉంది? ఎలా జీవించింది? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మొత్తానికి, పదేళ్ల విరామం తర్వాత చార్లీ తన కుటుంబాన్ని చేరుకోవడం వారి జీవితంలో మరపురాని క్షణంగా నిలిచిపోయింది. పెంపుడు జంతువులకు మైక్రోచిప్ అమర్చడం వల్ల అవి తప్పిపోయినప్పుడు యజమానులను గుర్తించడం ఎంత సులభమవుతుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థి గుండుపై తబలా వాయించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే..
ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన రాణి.. వీడియో వైరల్