Share News

కెనడాలో వైద్యుడు దొరక్క నరకం.. భారత్‌కు వచ్చేసిన ఎన్నారై

ABN , Publish Date - Apr 06 , 2026 | 08:40 PM

కెనడాలో తనకు సరైన వైద్యం అందలేదంటూ ఓ ఎన్నారై షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కెనడాలో వైద్యుడు దొరక్క నరకం.. భారత్‌కు వచ్చేసిన ఎన్నారై
Canada healthcare delay story

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో సరైన వైద్యం దొరక్క భారత్ వచ్చేశానంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తనకు అక్కడ శాశ్వత నివాసానికి అనుమతి ఉన్నా భారత్‌కు వచ్చేశానని సాహిల్ పేరిస్ అనే వ్యక్తి ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు. నెలల తరబడి ఎదురు చూసినా కెనడాలో స్పెషలిస్టు డాక్టర్‌ను కలిసే అవకాశం దక్కలేదని అన్నారు. స్వదేశానికి వచ్చాకే తన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పుకొచ్చారు.

తనకు కెనడాలో మంచి జీతం వచ్చే ఉద్యోగం, టొరంటోలో అపార్ట్‌మెంట్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ ఒక రోజు అకస్మాత్తుగా తగిలిన గాయంతో మెడ నొప్పి మొదలైందని అన్నారు. అక్కడి ఆరోగ్య వ్యవస్థ కారణంగా తనకు బాధ నుంచి విముక్తి లభించలేదని చెప్పుకొచ్చారు.


‘జనరల్ ఫిజీషియన్ అపాయింట్‌మెంట్ లభించేందుకే నాకు కొన్ని నెలల సమయం పట్టింది. కానీ వాళ్లు నన్ను స్పెషలిస్టు డాక్టర్‌కు రిఫర్ చేసేందుకు నిరాకరించారు. నా నొప్పి అంత తీవ్రమైనది కాదని అన్నారు. నువ్వేమీ నొప్పితో నేలపై గిలగిలా కొట్టుకోవట్లేదు కదా అని ఎదురు ప్రశ్నించారు. కెనడాలో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. కెనడాలో జనరల్ ఫిజీషియన్‌లు రిఫర్‌ చేయకుండా స్పెషలిస్టులను కలవడం చాలా కష్టమని ఆయన తెలిపారు.

ఇండియాకు వచ్చి రెండేళ్లకు పైనే అవుతోందని, ఇక్కడ వైద్యం చేయించుకున్నాక ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని చెప్పుకొచ్చారు. ఇండియాకు వచ్చాకే తాను ఎమ్‌ఆర్ఐ పరీక్ష చేయించుకోగలిగానని తెలిపారు. తనకు స్లిప్ డిస్క్ ఉన్నట్టు ఇక్కడి స్పెషలిస్టులు గుర్తించారని వివరించారు. కాబట్టి విదేశాలకు వెళ్లదలిచిన వారు అక్కడి వ్యవస్థలపై ముందస్తుగానే పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచించారు.

ఇక ఈ పోస్టుపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాను 20 ఏళ్లుగా కెనడాలో ఉంటున్నా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఒకరు అన్నారు. తనకూ దాదాపుగా ఇలాంటి అనుభవమే ఎదురైందని మరొక వ్యక్తి చెప్పుకొచ్చారు.


ఈ వార్తలూ చదవండి:

ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్

నాకు ఆఫీసులో పనే ఉండదు.. టెకీ పోస్టు వైరల్

Updated Date - Apr 06 , 2026 | 08:48 PM