సీటు బెల్టు పెట్టుకోని చిన్నారి.. ఫ్లైట్ రద్దు
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:17 AM
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో తాజాగా ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో చిన్నారి సీటు బెల్టు పెట్టుకోకుండా నిలబడి మారాం చేయడంతో చివరకు ఫ్లైట్ రద్దైపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో తాజాగా ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో చిన్నారి సీటు బెల్టు పెట్టుకోకుండా నిలబడి మారాం చేయడంతో చివరకు ఫ్లైట్ రద్దైపోయింది. పోర్టర్ ఎయిర్‌లైన్స్‌లో గురువారం ఈ ఘటన వెలుగు చూసింది.
మీడియా కథనాల ప్రకారం, విక్టోరియా-టొరంటో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టర్మినల్‌ను వీడి రన్‌వేపైకి వస్తుండగా చిన్నారి సీటు బెల్టు పెట్టుకోని విషయాన్ని విమాన సిబ్బంది గుర్తించారు. సీటుపై నిలబడి మారం చేస్తున్న చిన్నారికి నచ్చ చెప్పేందుకు పేరెంట్, విమానం సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టేకాఫ్ ప్రమాదమని సిబ్బంది భావించారు. వారిని దించేద్దామని నిర్ణయించారు.
దీంతో, ఫ్లైట్ వెనక్కు తిరిగి మళ్లీ టర్మినల్ వద్దకు వచ్చింది. ఆ తరువాత వారిని లగేజీతో సహా కిందకు దించే సరికి చాలా ఆలస్యమైంది. ఆ రాత్రికి టేకాఫ్‌కు అనుమతి లేకపోవడంతో చివరకు ఫ్లైట్ రద్దు చేయాల్సి వచ్చింది. విమానంలోని ఇతర ప్యాసింజర్లు ఆ రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే గడిపారు. ఈ క్రమంలో పోర్టర్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.
ఇటీవల కౌలాలంపూర్ నుంచి కొచ్చీకి వస్తున్న విమానంలో ఓ కేరళ వాసి నానా రభసా సృష్టించిన విషయం తెలిసిందే. ల్యాండింగ్‌కు ముందు ఆ ప్యాసింజర్ ఎమర్జెన్సీ తలుపు తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై ప్యాసింజర్ బెదిరింపులకు కూడా దిగాడు. ఇతర ప్యాసింజర్ల సాయంతో సిబ్బంది అతడిని విమానం క్షేమంగా ల్యాండయ్యే వరకూ నిలువరించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఈ వార్తలనూ చదవండి:
వరద నీటిలో ప్రాణాలు కాపాడుకున్న ఎలుక.. వీడియో వైరల్
ఎలుగుబంట్లను చూసి చెట్టు ఎక్కేశాడు.. చివరికి జరిగింది చూస్తే..