కారులో సిగరెట్ కాల్చినందుకు ప్రయాణికుడిని దించేసిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:27 AM
క్యాబ్‌లో అనుమతి లేకుండా సిగరెట్ కాల్చిన ప్రయాణికుడిపై ఓ డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైడ్ క్యాన్సిల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో క్యాబ్ (టాక్సీ) సేవలు మన దైనందిన జీవితంలో ఒక విడదీయరాని భాగమైపోయాయి. కొన్నిసార్లు క్యాబ్ డ్రైవర్లు, ప్యాసింజర్ల మధ్య గొడవలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాబ్‌లో అనుమతి లేకుండా సిగరెట్ కాల్చిన ప్రయాణికుడిపై ఓ డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైడ్ క్యాన్సిల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్రైవర్ల హక్కులు, ప్రయాణికుల ప్రవర్తనపై ఇది పెద్ద చర్చకు దారితీసింది.
లక్షయ్ మెహతా అనే యూజర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఈ వైరల్ వీడియోలో.. కారు లోపల ప్రయాణికుడు సిగరెట్ వెలిగించడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అతడిని గట్టిగా నిలదీశాడు. నా కారులో పొగతాగడం నిషిద్ధమని, సిగరెట్ వెలిగించే ముందు కనీసం నా అనుమతి ఎందుకు తీసుకోలేదని డ్రైవర్ ప్రశ్నించాడు. అయితే, తాను డబ్బులు పెట్టి టాక్సీని బుక్ చేసుకున్నానని, కాబట్టి కారులో సిగరెట్ తాగడానికి ఎవరి అనుమతి అవసరం లేదంటూ ప్రయాణికుడు డ్రైవర్‌తో వాదనకు దిగాడు. ప్రయాణికుడి సమాధానంతో ఆగ్రహం చెందిన డ్రైవర్.. కారు తన వ్యక్తిగత ఆస్తి అని, అందులోని నియమాలను ఎవరైనా గౌరవించాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆపై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రయాణాన్ని మధ్యలోనే రద్దు (క్యాన్సిల్) చేశాడు. ‘నాకు నీ డబ్బులు అవసరం లేదు, దయచేసి నా కారులో నుంచి దిగిపో.. నేను టాక్సీ డ్రైవర్‌ని మాత్రమే, నీ ఇంట్లో పనివాడిని కాను’ అంటూ సదరు ప్రయాణికుడిని కారు నుంచి కిందకు దించేశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్