Blinkit Delivery Agent: అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్.. మంచి మనసు చాటుకున్న డెలివరీ బాయ్..
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:08 PM
ఓ డెలివరీ బాయ్ గొప్ప మనసు చాటుకున్నాడు. తన తెలివితో ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. తన కారణంగా ఆమె ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన తెలివితో ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. తన కారణంగా ఆమె ప్రాణాలు పోకుండా ఎంతో జాగ్రత్తపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చెన్నైకి చెందిన ఓ మహిళ అర్ధరాత్రి బ్లింకిట్‌లో ఎలుకల మందు ఆర్డర్ పెట్టింది. డెలివరీ బాయ్ వాటిని తీసుకుని ఆ మహిళ ఇంటి దగ్గరకు వెళ్లాడు. అతడు తలుపు కొట్టగా.. మహిళ బయటకు వచ్చింది. ఆమెను చూడగానే డెలివరీ బాయ్‌కి అనుమానం కలిగింది. ఆ మహిళ ఎంతో నీరసించి.. బాగా డిప్రెషన్‌లో ఉన్నట్లు కనిపించింది.
ఆమె పరిస్థితి చూడగానే డెలివరీ బాయ్ మనసు కీడు శంకించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఎలుకల మందు ఆర్డర్ చేసినట్లు భావించాడు. ఎలుకల మందును ఆమెకు ఇవ్వలేదు. ఎలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవద్దని ఆమెకు చెప్పాడు. ఆర్డర్ క్యాన్సిల్ చేయించి అక్కడినుంచి వచ్చేశాడు. రోడ్డు మీద ఉన్నపుడే సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు. ఏం జరిగిందో వీడియోలో చెప్పుకొచ్చాడు. సెల్ఫీ వీడియోలో అతడు మాట్లాడుతూ.. ‘ఏ సమస్య ఉన్నా సరే ఆత్మహత్య చేసుకోకండి. ఆత్మహత్య చేసుకోవటానికి ఎలుకల మందు ఆర్డర్ చేశావా? అని ఆమెను అడిగాను.
ఆమె కాదు అని చెప్పింది. ఒక వేళ ఆమెకు ఎలుకల మందు కావాలంటే పగటి పూట ఆర్డర్ చేయాల్సింది. అంతగా అవసరం అయితే, మరుసటి రోజు ఉదయం ఆర్డర్ పెట్టాల్సింది. కానీ, అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ పెట్టింది. నేను ఆమెను బతిమాలి ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేలా చేశాను. అక్కడి నుంచి వచ్చేశాను. నా జీవితంలో ఏదో గొప్ప విజయం సాధించినట్లుగా అనిపిస్తూ ఉంది’.. అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతడిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ‘నువ్వు చాలా గ్రేట్’ అంటూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐసీసీ నిధులే బంగ్లా క్రికెట్‌కు ఆధారం.. మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని అటకెక్కించారు