బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
ABN , Publish Date - Mar 07 , 2026 | 07:46 PM
ఒక రెస్టారెంట్ వారు దోశను బొగ్గులా నల్లగా తయారు చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రయోగాన్ని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రోజూ తినే ఆహార పదార్థాలను కొత్త తరహాలో తయారు చేసేందుకు కొందరు ఇష్టపడుతుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయోగాలు చేసి వాటి ఫలితాలను నెట్టింట పంచుకుంటూ ఉంటారు. అయితే, తాజాగా దోశపై ఒక రెస్టారెంట్ ఇదేరకమైన ప్రయోగం చేసింది. బొగ్గులా నల్ల రంగులో కనిపిస్తున్న ఈ దోశను చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. సంప్రదాయక వంటకాలతో ఇలాంటి ప్రయోగాలు వద్దంటూ గోల గోల చేస్తున్నారు (Black Dosa Viral Video).
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోగల యెల్లో కేఫ్ అనే రెస్టారెంట్ వారు దోశతో ఈ వింత ప్రయోగాన్ని చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దోశ పేరు చెబితే సాధారణంగా ఎవరికైనా ముదురు గోధుమ రంగులో ఘుమఘుమలాడిపోయే వంటకం గుర్తుస్తోంది. కానీ తాజా ప్రయోగంలో మాత్రం నల్ల రంగులో దోశ కనిపించిన తీరు జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వీడియోలోని వ్యక్తి ఈ నల్లటి దోశ పిండిని యథాప్రకారం వలయాకారంలో పెనంపై పరిచారు. మధ్యలో ఆలూ మసాలా పెట్టారు. దోశ బాగా కాలాక అట్లకాడతో జాగ్రత్తగా తీశారు.
ఇక వీడియో చూసిన వారందరూ పెదవివిరిచారు. దోశ మరీ ఇలా నల్లగా ఉండటాన్ని చూసి అనేక మంది తట్టుకోలేకపోయారు. దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేకతకు చిహ్నంగా నిలిచే దోశతో ఇలాంటి ప్రయోగాలు వద్దని అనేక మంది గగ్గోలు పెట్టారు. దోశ పిండి ఇలా నల్లగా మారటానికి అందులో ఏమి కలిపారని మరికొందరు ప్రశ్నించారు. దోశకు అన్యాయం జరిగిందని కొందరు వాపోయారు. అసలు ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారని మరి కొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలూ చదవండి:
కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..
30 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డ ఏనుగు! ఎలా బయటకు తీశారంటే..