Share News

30 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డ ఏనుగు! ఎలా బయటకు తీశారంటే..

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:30 PM

బావిలో పడ్డ ఏనుగును ఒడిశాలోని అటవీ శాఖ అధికారులు ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాపాడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబందించిన వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.

30 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డ ఏనుగు! ఎలా బయటకు తీశారంటే..
Elephant Rescued in Odisha

ఇంటర్నెట్ డెస్క్: ముప్ఫై అడుగుల లోతున్న బావిలో పడిపోయిన ఏనుగును అటవీ శాఖ అధికారులు తాజాగా కాపాడారు (Odisha Elephant Rescue). భౌతిక శాస్త్రంలోని ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి (Archimedes Principle) ఆ మూగ జీవాన్ని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అటవీ శాఖ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని సదర్ రేంజ్ ప్రాంతంలో ఒక మగ ఏనుగు బావిలో పడిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అంత లోతున ఉన్న ఏనుగును బయటకు లాగడం తొలుత పెద్ద సవాలుగా అనిపించింది. కొంత తర్జనభర్జనల అనంతరం వారు ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఏనుగును బయటకు లాగారు. ఇందులో భాగంగా బావిలో నీటిని నింపారు. నీటి స్థాయి పెరిగే కొద్దీ బాయంట్ ఫోర్స్ (ఊర్ధ్వముఖ శక్తి) కారణంగా ఏనుగు కూడా తేలుతూ బావి అంచు దాకా వచ్చింది. అనంతరం, క్రేన్ సాయంతో దాన్ని వెనక నుంచి నెడుతూ బావి నుంచి బయట పడేలా చేయగలిగారు.


ఇందుకు సంబంధించిన వీడియోను కూడా వారు షేర్ చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో జనాలు అటవీ శాఖ అధికారులను అభినందించారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి మూగ జీవాన్ని కాపాడారని అన్నారు. బావుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. జంతువులు వాటిలో పడకుండా గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!


ఈ వార్తలూ చదవండి:

చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో

సాటి ఉద్యోగుల లేఆఫ్స్‌ను తట్టుకోలేక టెకీ సంచలన నిర్ణయం

Updated Date - Mar 07 , 2026 | 04:40 PM