Share News

సాటి ఉద్యోగుల లేఆఫ్స్‌ను తట్టుకోలేక టెకీ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Mar 06 , 2026 | 07:45 PM

ఇతర ఉద్యోగులను తొలగించాక తనకు జీతం పెంచుతానన్న సంస్థ ఆఫర్‌ను స్వీకరించలేకపోయానని ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్‌కు చెందిన ఓ మాజీ ఉద్యోగి నెట్టింట పోస్టు పెట్టారు. చివరకు తానూ సంస్థను వీడానని చెప్పారు.

సాటి ఉద్యోగుల లేఆఫ్స్‌ను తట్టుకోలేక టెకీ సంచలన నిర్ణయం
Block layoffs AI impact,

ఇంటర్నెట్ డెస్క్: ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నేతృత్వంలోని ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ (Block LayOffs) ఇటీవల ఏకంగా 4 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తొలగింపులు తప్పలేదని జాక్ డోర్సీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, మిగిలిన ఉద్యోగుల్లో కొందరికి జీతాలను భారీగా పెంచేందుకు కూడా సంస్థ నిర్ణయించినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో బ్లాక్ సంస్థలో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తనకూ ఇలాంటి ఆఫర్ వచ్చినప్పటికీ తాను తిరస్కరించానని తెలిపారు. చివరకు సంస్థను వీడానని చెప్పారు. సహోద్యోగులు జాబ్స్ కోల్పోతున్న తరుణంలో ఈ ఆఫర్‌ను అంగీకరించేందుకు తన మనసు ఒప్పుకోలేదని అన్నారు.

లేఆఫ్స్ తరువాత మిగిలిన ఉద్యోగులకు బ్లాక్ సంస్థ భారీ స్థాయిలో జీతాలు పెంచేందుకు నిర్ణయించిందని సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు. తనకూ అలాంటి ఆఫరే వచ్చిందని అన్నారు. ఆ లేఆఫ్స్ నుంచి తాను తప్పించుకోగలిగానని చెప్పుకొచ్చారు. ఆ తరువాత వన్ టైమ్ బోనస్‌తో కలిపి జీతం 90 శాతం మేర పెంచేలా సంస్థ ఆఫర్ ఇచ్చిందని అన్నారు. కానీ ఆ ఆఫర్‌ను స్వీకరించేందుకు తనకు మనసు రాలేదని చెప్పుకొచ్చారు. దాదాపు సంవత్సరన్నరగా కలిసి పని చేసిన సహోద్యోగులు సంస్థను వీడుతుంటే తాను కంపెనీ ఆఫర్‌ను స్వీకరించలేకపోయానని చెప్పారు.


‘సహోద్యోగుల వేదనతో లాభపడే దాని కంటే వారు ఉద్యోగాల్లో కొనసాగడాన్నే నేను ఆనందిస్తాను. అదృష్టవశాత్తూ నేను ఇప్పటివరకూ ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోలేదు. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. నాపై ఆధారపడ్డ వాళ్లు ఎవరూ లేరు. కానీ నా సహోద్యోగుల్లో చాలా మందికి కుటుంబాలు ఉన్నాయి. వైద్య ఖర్చుల భారం ఉంది. వీసా సమస్యల కారణంగా కొందరు డిపోర్టేషన్ ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు. లేఆఫ్స్‌తో యాజమాన్యం సృష్టించిన ఈ అస్తవ్యస్త వ్యవస్థను చక్కదిద్దడానికి మిగిలిన వారికి జీతాలను పెంచేందుకు నిర్ణయించారు. చివరకు ఎవరికీ ఉద్యోగాలే లేని ఏఐ భవిష్యత్తును సాకారం చేసేందుకు మేము శ్రమించాలన్నమాట. ఇది నాకు అస్సలు నచ్చలేదు.. అందుకే గుడ్ బై చెప్పా’ అని సదరు వ్యక్తి రాసుకొచ్చారు.


ఈ వార్తలూ చదవండి:

చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో

ఇదేం పైత్యం రా నాయనా! ఇరాన్ దాడుల వీడియోతో యాడ్స్!

Updated Date - Mar 06 , 2026 | 07:56 PM