అదృష్టం అంటే ఈమెదే.. రూ.7తో కోటి గెలిచింది..
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:22 PM
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. పిల్లలకు కొత్త బట్టలు కొనాలనే ఉద్దేశంతో షాపింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు అనుకోకుండా కోటి రూపాయల బహుమతి దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఎప్పుడు.. ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. పంజాబ్‌లోని కోట్కపురాకు చెందిన బిమ్లా దేవికి అలాంటి అదృష్టం వరించింది. పిల్లల కోసం బట్టలు కొనుగోలు చేసేందుకు షాపింగ్‌కు వెళ్లిన ఆమె.. సరదాగా కేవలం రూ.7తో లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. అయితే ఆ చిన్న నిర్ణయం ఆమె కుటుంబ జీవితాన్నే మార్చేసింది.
సిక్కిం ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో బిమ్లా దేవి ఏకంగా రూ.కోటి బహుమతిని గెలుచుకుంది. కోట్కపురాలోని రైల్వే రోడ్డులో, రైల్వే స్టేషన్ సమీపంలోని స్టార్ లాటరీ స్టాల్లో ఆమె ఈ టికెట్ కొనుగోలు చేసింది. లాటరీ ఫలితాలు వెలువడిన తర్వాత స్టాల్ యజమాని నరేష్ మోంగా ఆమె కుటుంబాన్ని సంప్రదించడంతో మరుసటి రోజు ఈ శుభవార్త తెలిసింది. ఒక్కసారిగా కోటి రూపాయల బహుమతి వచ్చిందన్న విషయం తెలుసుకున్న బిమ్లా దేవి, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో స్టాల్ వద్దకు చేరుకున్నారు. యజమాని వారికి స్వీట్లు అందించి అభినందించగా.. కుటుంబ సభ్యులు భాంగ్రా నృత్యంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, ఇరుగుపొరుగు వారు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
బిమ్లా దేవి కుటుంబానికి ఈ బహుమతి ఎంతో ఊరటనిచ్చే విషయంగా మారింది. ఆమె భర్త రోజువారీ కూలీగా పనిచేస్తుండటంతో కుటుంబ పోషణ.. పిల్లల అవసరాలు తీర్చడం గతంలో అంత సులభంగా ఉండేది కాదు. అయితే.. వచ్చిన డబ్బును ఎలా వినియోగించుకోవాలనే దానిపై బిమ్లా దేవి కుటుంబం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బంధువులతో చర్చించిన తర్వాతే భవిష్యత్తు ప్రణాళికలను ఖరారు చేయాలని భావిస్తోంది. ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి స్థిరమైన ఆదాయాన్ని పొందే ఆలోచన కూడా వారి పరిశీలనలో ఉంది. మరోవైపు.. స్టార్ లాటరీ స్టాల్ యజమాని నరేష్ మోంగా సుమారు ఆరు నెలలుగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. గతంలో తన స్టాల్ ద్వారా లక్షల రూపాయల బహుమతులు గెలుచుకున్న టికెట్లు విక్రయించినప్పటికీ.. రైల్వే స్టేషన్ సమీపంలో స్టాల్ ఏర్పాటు చేసిన తర్వాత కోటి రూపాయల బహుమతిని గెలుచుకున్న తొలి విజేత బిమ్లా దేవేనని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
రూ.10 నోటు మార్చమన్నందుకు చెంపదెబ్బలు.. అవమానంతో డెలివరీ బాయ్ ఆత్మహత్య
ఈఫిల్ టవర్ వివాదంపై బ్రహ్మవిహారి స్వామీజీ వివరణ.. బాప్స్పై అపార్థం తొలగిపోతుందా?