Share News

బీహార్‌లో పార్క్ చేసిన స్కూటర్ లో మూడడుగుల కొండచిలువ కలకలం.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:31 PM

సాధారణంగా స్కూటర్‌పై బయటకు వెళ్లాలంటే తాళం తీసి స్టార్ట్ చేస్తాం. కానీ అదే స్కూటర్‌లో మూడు అడుగుల కొండచిలువ దాక్కుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్‌లో ఓ వ్యక్తికి ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది.

బీహార్‌లో పార్క్ చేసిన స్కూటర్ లో మూడడుగుల కొండచిలువ కలకలం.. వీడియో వైరల్
Python Rescue

ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లోని బంకా జిల్లాలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. కటోరియా బజార్‌లోని బంకా రోడ్డులో కంచన్‌గలి మలుపు సమీపంలో ఎరువుల దుకాణదారుడు అవినాష్ కప్రి తన స్కూటర్‌ను రోడ్డు పక్కన పార్క్ చేశాడు. ఇంతలో సుమారు మూడడుగుల పొడవున్న కొండచిలువ స్కూటర్‌లోకి దూరింది. అయితే.. స్కూటర్‌లో పాము ఉన్నట్లు తెలియడంతో మార్కెట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. దాన్ని బయటకు తీసేందుకు స్థానికులు రకరకాల ప్రయత్నాలు చేశారు. కొందరు కర్రలతో స్కూటర్‌ను కొట్టగా.. మరికొందరు లోపలికి నీళ్లు పోశారు. అయినప్పటికీ పాము బయటకు రాకుండా మరింత లోపలికి వెళ్లి దాక్కుంది. దీంతో దాదాపు అరగంట పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో స్కూటర్‌ను సమీపంలోని గ్యారేజీకి తరలించారు.


అక్కడ మెకానిక్ స్కూటర్ సీటు కింద ఉన్న ప్యానెల్‌ను తొలగించి.. ఎంతో జాగ్రత్తగా కొండచిలువను బయటకు తీశాడు. అప్పటికే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని ఓ పెట్టెలో ఉంచి అడవిలో విడిచిపెట్టారు. దీంతో స్కూటర్ యజమానితో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణంలో మార్పులు, చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో పాములు వెచ్చని ప్రదేశాల కోసం వెతుకుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనాల లోపల కూడా ఆశ్రయం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువసేపు పార్క్ చేసిన వాహనాలను స్టార్ట్ చేసే ముందు ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. ముఖ్యంగా సీటు కింద, ఇంజిన్ పరిసరాల్లో జాగ్రత్తగా తనిఖీ చేయడం మంచిదంటున్నారు.


ఈ వార్తలూ చదవండి

బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు

ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

Updated Date - Nov 12 , 2026 | 04:00 PM