Share News

కర్రీలో బల్లి.. ఆ విషయం తెలిసి కూడా తినేశాడు..

ABN , Publish Date - Mar 23 , 2026 | 09:30 PM

ఓ స్టూడెంట్ కాలేజ్ క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా కర్రీలో బల్లి వచ్చింది. ఆగ్రహానికి గురైన ఆ స్టూడెంట్ భోజనం వడ్డిస్తున్నవారిని దాని గురించి ప్రశ్నించాడు. కర్రీలో వచ్చింది బల్లి కాదని నమ్మించడానికి క్యాంటీన్ సిబ్బంది షాకింగ్ పని చేశారు.

కర్రీలో బల్లి.. ఆ విషయం తెలిసి కూడా తినేశాడు..
RGPV canteen incident

భోపాల్, మార్చి 23: మధ్యప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ స్టూడెంట్ కాలేజ్ క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా కర్రీలో బల్లి వచ్చింది. ఆగ్రహానికి గురైన ఆ స్టూడెంట్ భోజనం వడ్డిస్తున్నవారిని దాని గురించి ప్రశ్నించాడు. కర్రీలో వచ్చింది బల్లి కాదని నమ్మించడానికి క్యాంటీన్‌లో పని చేసే ఓ వ్యక్తి బల్లిని కొరికి తినేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయంలో ఓ స్టూడెంట్ భోజనం చేయడానికి ఆదివారం రాత్రి క్యాంటీన్‌కు వెళ్లాడు. చపాతీ, కర్రీ ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నాడు.


ఈ నేపథ్యంలో కర్రీలో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్టూడెంట్ క్యాంటీన్ సిబ్బంది దగ్గరకు వెళ్లాడు. కర్రీలో వచ్చిన బల్లిని చూపెడుతూ వారిని గట్టిగా ప్రశ్నించాడు. అయితే, కర్రీలో వచ్చింది బల్లి కాదని క్యాప్షికం ముక్క అని భోజనం వడ్డిస్తున్న ఓ వ్యక్తి చెప్పాడు. అతడు బల్లిని చేతుల్లోకి తీసుకుని పక్కన ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి అది బల్లి కాదు.. క్యాప్షికం ముక్కే అని నమ్మించడానికి స్టూడెంట్ ఊహించని పని చేశాడు. బల్లిని సగం వరకు కొరికి తినేశాడు. ఆ స్టూడెంట్ ఈ సంఘటనను మొత్తం వీడియో తీశాడు. వీడియో ఆధారంగా విద్యార్థులు కొంతమంది సోమవారం దీనిపై వైస్ ఛాన్సిలర్‌కు ఫిర్యాదు చేశారు.


ఇక, ఈ సంఘటనపై ఏబీవీపీ సభ్యులు మాట్లాడుతూ.. ‘మెయిన్ క్యాంటీన్‌లో ప్రతీ రోజు 500 మంది విద్యార్థులకు భోజనం పెడుతుంటారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ విద్యార్థి తింటున్న కర్రీలో బల్లి వచ్చింది. క్యాంటీన్ సిబ్బంది బల్లిని.. క్యాప్షికం అని నమ్మించడానికి చాలా ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఒకరు కాదు, చాలా మందితో మాట్లాడాం.. ఇరాన్‌ నేతలతో చర్చలపై ట్రంప్

మోదీ రాజీపడ్డారు, పార్లమెంటులో చర్చకు రావడం లేదు.. వడోదరలో రాహుల్

Updated Date - Mar 23 , 2026 | 09:51 PM