మోదీ రాజీపడ్డారు, పార్లమెంటులో చర్చకు రావడం లేదు.. వడోదరలో రాహుల్
ABN , Publish Date - Mar 23 , 2026 | 08:24 PM
పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా కూడా అమెరికా పేరును ప్రస్తావించ లేదని, నూటికి నూరు శాతం ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్‌లో ఉన్నారని విమర్శించారు.
వడోదర: పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) లోక్‌సభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా కూడా అమెరికా పేరును ప్రస్తావించ లేదని, నూటికి నూరు శాతం ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్‌లో ఉన్నారని విమర్శించారు. పార్లమెంటులో చర్చకు ప్రధాని రావడం లేదని, అందుకు ఆయన రాజీపడమే కారణమని అన్నారు. గుజరాత్‌లోని వడోదరలో సోమవారంనాడు జరిగిన 'ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన్'లో రాహుల్ పాల్గొన్నారు.
'పార్లమెంటులో 25 నిమిషాలు ప్రధానమంత్రి మాట్లాడినట్టు విన్నాను. కానీ కచ్చితంగా ఒక మాట చెప్పగలను. ఆయన అన్నివిధాలా రాజీపడినందునే పార్లమెంటు చర్చల్లో పాల్గొనడం లేదు. 25 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. 100 శాతం ట్రంప్ కంట్రోల్‌లో ఆయన ఉన్నారు' అని రాహుల్ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య డీల్ పేరుతో భారత వ్యవసాయ రంగానికి తలుపులు బార్లా తెరిచారని, దీంతో దేశీయంగా రైతుల పతనం ఖాయమని అన్నారు. 'ఇక్కడ ఉన్నవారంతా చిన్న రైతులు. అమెరికాలో వేలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఇక్కడ రైతులు చేతులతో పనిచేస్తే, అక్కడ మెషీన్లతో పనిచేస్తారు. అమెరికా ఉత్పత్తులు భారత్‌కు రావడం మొదలైతే మన రైతుల పని ముగిసినట్టే' అని విశ్లేషించారు.
గిరిజనులకు చెందిన భూములు, నీళ్లు, అడవులను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని రాహుల్ ఆరోపించారు. ఆదివాసీలు అంటే భారత్‌లో నివసించే వారని, భూములు, నీళ్లు, అడవులపై నిజమైన హక్కులు వారివేనని అన్నారు. నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా విగ్రహం ముందు చేతులు కట్టుకుని నిలబడతారని, నిజానికి బిర్సా ముండా జరిపిన పోరాట సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలను వనవాసీలుగా సంబోధిస్తూ వారి హక్కులను బీజేపీ కొల్లగొడుతోందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో ఎన్డీయే సీట్ల పంపకాల ఖరారు... అన్నాడీఎంకేకు 170, బీజేపీకి 27 సీట్లు
హోర్ముజ్‌ను దాటిన భారత నౌకలు జగ్ వసంత్, పైన్ గ్యాస్