గంటలో అంతా తారుమారు.. మహిళకు షాక్! వీడియో వైరల్
ABN , Publish Date - Apr 14 , 2026 | 09:10 AM
అద్దె ఇంటి కోసం వెతికే క్రమంలో తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో చెబుతూ ఒక మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో అద్దె ఇళ్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అక్కడ ఇళ్ల కోసం ఎంత పోటీ ఉంటుందో ఒక మహిళకు ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో చెబుతూ ఆమె షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
@namma_rants అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు. ఇటీవలే తాను బెంగళూరుకు వచ్చానని ఆమె తెలిపారు. అద్దె ఇంటి కోసం వెతుకుతుండగా ఒక ఇల్లు తనకు బాగా నచ్చిందని అన్నారు. దాదాపు నెల రోజుల పాటు వెతికితే కానీ తనకు నచ్చిన ఇల్లు దొరకలేదని అన్నారు. ఇల్లు నచ్చడంతో తాను అనేక విషయాల్లో రాజీ పడ్డానని చెప్పుకొచ్చారు. ఇంటి అద్దె తగ్గించేది లేదని ఓనర్ చెప్పినా తాను సర్దుకుపోయానని చెప్పారు. అయితే, తుది నిర్ణయం తీసుకునేందుకు ఒక్క గంట సమయం మాత్రమే కోరానని చెప్పారు.
అడ్వాన్స్ ఇచ్చేందుకు గంట తరువాత ఇంటి ఓనర్‌కు ఫోన్ చేస్తే అప్పటికే వేరే వాళ్లకు ఇచ్చేసినట్టు ఓనర్ తెలిపారని చెప్పారు. ఇది తనకు తీవ్ర నిరాశను కలిగించిందని అన్నారు. నచ్చిన ఇంటిని కోల్పోతే అయిన వాళ్లను కోల్పోయినంత బాధ కలుగుతుందని అన్నారు. మరో ఇల్లు దొరికేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదని విచారం వ్యక్తం చేశారు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బెంగళూరులో పరిస్థితి ఇంతేనని అనేక మంది కామెంట్ చేశారు. 30 నిమిషాల వ్యవధిలో తాను అద్దె ఇంటిని మిస్ చేసుకున్నానని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. విచారం వద్దని మరికొంత మంది అన్నారు. వెతికితే అంతకంటే మంచి ఇల్లే దొరుకుతుందని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
చిన్ననాటి ఇంటిని చూద్దామని విమానం దారి మళ్లింపు!
ఉద్యోగులకు సంస్థ అధిపతి బంపర్ ఆఫర్! ఈయన నిజంగా మనసున్న మారాజే..