Share News

చిన్ననాటి ఇంటిని చూద్దామని విమానం దారి మళ్లింపు!

ABN , Publish Date - Apr 13 , 2026 | 02:22 PM

ఐస్‌ల్యాండ్‌ఎయిర్ సంస్థకు చెందిన ఒక పైలట్ విమానాన్ని తన చిన్ననాటి ఇంటి వైపుగా దారి మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఘటనపై సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.

చిన్ననాటి ఇంటిని చూద్దామని విమానం దారి మళ్లింపు!
Icelandair pilot incident

ఇంటర్నెట్ డెస్క్: ఐస్‌ల్యాండ్‌ఎయిర్ సంస్థకు చెందిన ఒక పైలట్ ముందస్తు అనుమతి లేకుండానే తన విమానాన్ని దారి మళ్లించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను పెరిగిన ఇంటి మీదుగా తక్కువ ఎత్తులో విమానాన్ని నడిపినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని సంస్థ తాజాగా పేర్కొంది.

ఐస్‌ల్యాండ్‌ఎయిర్ విమానం ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ) నుంచి కెఫ్లావిక్‌కు (ఐస్‌ల్యాండ్) వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సుదీర్ఘ కెరీర్‌ కలిగిన ఆ పైలట్‌కు సంస్థలో అదే చివరి ఫ్లైట్ జర్నీ. ఈ క్రమంలో పైలట్ అసాధారణ చర్యకు దిగినట్టు తెలిసింది. మార్గమధ్యంలోని ఓ ద్వీపంలో ఉన్న తన ఇంటి మీదుగా తక్కువ ఎత్తులో విమానాన్ని నడిపినట్టు సమాచారం. అది సాధారణ ప్యాసింజర్ సర్వీసు అని, దారి మళ్లింపునకు సంబంధించి పైలట్ ఎలాంటి ముందస్తు అనుమతులూ తీసుకోలేదని తెలుస్తోంది.


ఈ ఘటనపై ఐస్‌ల్యాండ్‌ఎయిర్ సంస్థ చీఫ్ ఫ్లైట్ ఆఫీసర్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అంతర్గత దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. దారి మళ్లింపునకు మునుపు కనీసం ప్యాసింజర్లకైనా పైలట్ సమాచారం అందించి ఉండవచ్చని అన్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఏదేమైనా ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘనగా తాము పరిగణిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి:

ఉద్యోగులకు సంస్థ అధిపతి బంపర్ ఆఫర్! ఈయన నిజంగా మనసున్న మారాజే..

29 సెకెన్ల ఛాలెంజ్.. ఈ రెండు ఫొటోల మధ్యలో మూడు తేడాలను కనిపెట్టండి..

Updated Date - Apr 13 , 2026 | 03:14 PM