ఉద్యోగులకు సంస్థ అధిపతి బంపర్ ఆఫర్! ఈయన నిజంగా మనసున్న మారాజే..
ABN , Publish Date - Apr 12 , 2026 | 10:49 PM
ఉద్యోగులకు వారానికి నాలుగు పనిదినాలతో పాటు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఆఫర్ ఇచ్చిన ఓ సంస్థ అధిపతి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. సంస్థలోని ఉద్యోగులు అదృష్టవంతులంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ సంస్థల్లో నిరంతరం శ్రమిస్తూ మాసిక, శారీరక అలసటలకు లోనయ్యే ఉద్యోగులు ఎందరో ఉంటారు. ఉద్యోగ జీవితంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న వ్యక్తి తన సంస్థలోని ఉద్యోగుల బాగోగులకు పెద్ద పీట వేశారు. వారానికి నాలుగు పనిదినాల సదుపాయాన్ని అమలు చేయడంతో పాటు ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశాన్ని కల్పించారు. బ్రిటన్‌లోని ఒక ఎస్‌ఈఓ కన్సల్టెన్సీ సంస్థ మార్గరీటా వ్యవస్థాపకుడు బెన్ గూడీ ఈ మార్పులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ లింక్డ్‌ఇన్‌లో ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘నేను ఉద్యోగిగా ఉన్న రోజుల్లో ఇలాంటి వేదననే అనుభవించా. చివరకు అసలు పనే చేయలేనేమో అన్నంత మానసిక అలసటకు లోనయ్యా. అప్పుడు చేస్తున్న తప్పు అర్థమైంది. విజయం, పర్‌ఫెక్షన్‌ల వెంట పరుగులు తీస్తూ నన్ను నేను నిర్లక్ష్యం చేసుకోకూడదని అనుకున్నాను’ అని చెప్పారు.
ఈ దిశగా తన సంస్థలో ఉద్యోగుల మేలు కోసం అనేక మార్పులు చేశానని చెప్పుకొచ్చారు. వారానికి నాలుగు పనిదినాలు, ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేసే వెలుసుబాటు వంటి విధానాలను తీసుకొచ్చానని చెప్పారు. రోజుకు ఉద్యోగులు ఇన్ని గంటలు పని చేయాలన్న నిబందన కూడా లేదని అన్నారు. సంస్థ అధిపతిగా తనకు పని జరగడమే ముఖ్యమని చెప్పారు. ఉద్యోగులకు మానసిక ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చారు.
ఇక ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలాంటి చోట పనిచేయాలని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇంతటి స్వేచ్ఛ గౌరవాన్ని పొందుతున్న ఆ సంస్థ ఉద్యోగులు నిజంగా అదృష్టవంతులని మరికొందరు కామెంట్ చేశారు.