Share News

పెంపుడు కుక్క విషయంలో గొడవ.. యువకుడిపై వృద్ధుల దాడి

ABN , Publish Date - Mar 08 , 2026 | 07:02 AM

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా కొంతమంది వృద్ధులు యువకుడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా యువకుడిని చావచితక్కొట్టారు.

పెంపుడు కుక్క విషయంలో గొడవ.. యువకుడిపై వృద్ధుల దాడి
Bengaluru dog walk dispute,

బెంగళూరు, మార్చి 8: పెంపుడు కుక్క విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా కొంతమంది వృద్ధులు యువకుడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా యువకుడిని చావచితక్కొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన తరుణ్ అరోరా అనే యువకుడు బ్రిగేడ్ యుటోపియాలోని ఈస్ట్ ఆంటోపియా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ఉదయం తన పెంపుడు కుక్కను తీసుకుని అపార్ట్‌మెంట్‌లోని వాకింగ్ ఏరియాలోకి వాకింగ్‌కు వెళ్లాడు.


ఆ వాకింగ్ ఏరియాలో వృద్ధులు వ్యాయామాలు చేస్తున్నారు. ఆ ప్రదేశంలోకి తరుణ్ కుక్కను తీసుకురావటంపై వృద్ధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది కేవలం ముసలివాళ్లు వాకింగ్ చేయటం కోసం కేటాయించిన ప్రదేశం. ఇక్కడికి కుక్కను తీసుకురాకూడదు. అది ఎక్కడపడితే అక్కడ మూత్రం పోసి ఈ ప్రదేశాన్ని పాడుచేస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి దాన్ని తీసుకెళ్లు’ అని అన్నారు. ఇందుకు తరుణ్ ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలైంది. ఆ గొడవ కొద్దిసేపటికే చిలికిచిలికి గాలివానలా తయారైంది. వృద్ధులు గుంపుగా చేరి తరణ్‌పై దాడి చేయటం మొదలెట్టారు.


మొదట్లో తరుణ్ వారిపై ప్రతి దాడికి దిగాడు. కానీ, ఐదు, ఆరు మంది ఒకేసారి దాడి చేయటంతో తట్టుకోలేకపోయాడు. నేలపై కుప్పకూలిపోయాడు. ఆ వృద్ధులు కిందపడ్డా తరుణ్‌ని వదల్లేదు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. తరుణ్ భార్య వృద్ధులను ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక, ఈ దాడిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

ఉన్న బిడ్డలకే దిక్కులేదు.. ముగ్గుర్ని కనాలా?

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.

Updated Date - Mar 08 , 2026 | 07:15 AM