కుక్క మెడకు ఇటుక కట్టి నీటిలో పడేసిన యువకుడు.. చివరికి..
ABN , Publish Date - Jun 29 , 2026 | 10:15 AM
బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డి జిల్లాకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్క మెడకు ఓ యువకుడు ఇటుకరాయి కట్టి నదిలో పడేయడంపై నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢాకా: బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డి జిల్లాకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్క మెడకు ఓ యువకుడు ఇటుకరాయి కట్టి నదిలో పడేయడంపై నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో చివరకు ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
వీడియో ప్రకారం.. నర్సింగ్డి మోడల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్రియాకండి వంతెనపై ఓ యువకుడు అర్ధనగ్నంగా ఉన్నాడు. అతని పక్కన ఓ మహిళ, ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. వారి ముందు ఓ కుక్క ఉంది. అర్ధనగ్నంగా ఉన్న యువకుడు ఆ శునకం మెడకు తాడు కట్టాడు. తాడు మరో చివర భాగానికి ఇటుకరాయి కట్టాడు. అనంతరం ఆ ఇటుకను పక్కనే ఉన్న మరో యువకుడికి పట్టుకోమని ఇచ్చాడు. అతను దాన్ని తీసుకున్న తర్వాత గ్రామసింహాన్ని ఎత్తి బ్రిడ్జిపై నుంచి అమాంతం నదిలో పడేశాడు. దీంతో ఇటుకరాయితో సహా కుక్క నీటిలో పడిపోయింది.
నీటిలో కొట్టుకుపోతూ ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఆ శునకం. తలను పైకి ఎత్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరేందుకు యత్నించింది. అయితే, ఇటుకరాయి బరువుగా ఉండటంతో చివరకు నీటిలో మునిగి కుక్క కొట్టుకుపోయింది. ఈ వీడియో ఫేస్‌బుక్ సహా అన్ని సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయింది. ఓ జంతు సంక్షేమ సంఘం దీన్ని షేర్ చేస్తూ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు అనేక మంది నెటిజన్లు కూడా యువకుడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు సంరక్షణ చట్టం కింద నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో సదరు యువకుడిని మహమ్మద్ అలీగా గుర్తించి అరెస్టు చేసినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ నోమన్ సదేకిన్ తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న మరో ముగ్గురినీ గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వారినీ త్వరలోనే అదుపులోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నోమన్ సదేకిన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్విమ్మింగ్ పూల్‌లోకి డైవ్ చేసిన యువకుడు.. క్షణాల్లోనే..
రాజధాని రోడ్లపై దూసుకుపోతున్న మహిళ.. ఇలా కూడా కారు నడుపుతారా?