హోటల్‌లోకి మొసలి.. షాకైన యజమాని, కస్టమర్లు..
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:31 PM
సాధారణంగా హోటళ్లలోకి కస్టమర్లు వస్తుంటారు. కానీ అమెరికాలోని ఓ బేగెల్ షాప్‌నకు మాత్రం అనూహ్యంగా మొసలి అతిథిగా వచ్చింది. దానిని చూసిన అక్కడి సిబ్బంది, కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
నార్త్ కరోలినా: సాధారణంగా హోటళ్లలోకి కస్టమర్లు వస్తుంటారు. కానీ అమెరికాలోని ఓ బేగెల్ షాప్‌నకు మాత్రం అనూహ్యంగా మొసలి అతిథిగా వచ్చింది. దానిని చూసిన అక్కడి సిబ్బంది, కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారి సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సురక్షితంగా మొసలిని పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం సౌత్‌పోర్ట్‌లో ఉన్న బేగెల్ డాక్ ఎక్స్‌ప్రెస్ షాప్‌లో చోటుచేసుకుంది.
బేగెల్ డాక్ ఎక్స్‌ప్రెస్ షాప్‌లోకి ఈరోజు (గురువారం) ఓ మొసలి పిల్ల ప్రవేశించింది. సుమారు మూడు అడుగుల పొడవున్న ఈ చిన్న మొసలి.. షాపు వెనుక వైపు తలుపు తెరిచి ఉండటంతో లోపలికి ప్రవేశించింది. స్టోర్‌రూమ్ దాటి కిచెన్ మీదుగా కౌంటర్ వరకు వెళ్లింది. ఆ సమయంలో యజమాని ఓ కస్టమర్‌తో మాట్లాడుతూనే కొత్త ఓవెన్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో మొసలి ఉన్న వైపుగా వెళ్లాడు. ఒక్కసారిగా దానిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అక్కడి నుంచి తలుపు వైపు పరుగులు తీశాడు. అక్కడే ఉన్న కస్టమర్‌కు విషయం చెప్పడంతో అతనూ దానిని చూశాడు.
అనంతరం మొసలిని అదుపు చేసేందుకు ఓ కుర్చీని తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న సౌత్‌పోర్ట్ పోలీసులు, జంతు సంరక్షణ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మొసలిని సురక్షితంగా పట్టుకుని మరో ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు, బేగెల్ షాప్‌లోకి వన్యప్రాణి రావడంపై దుకాణం యజమాని స్పందించాడు. తన షాపులోకి మొసలి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపాడు. తమ తాజా బేగెల్స్ గురించి వార్త చిత్తడి నేలల్లోని మొసళ్లకూ తెలిసిపోయిందంటూ చమత్కరించాడు.
నార్త్ కరోలినా తీర ప్రాంతాల్లో ఇటీవల మనుషులు, మొసళ్లు ఎదురుపడే ఘటనలు పెరుగుతున్నాయని అక్కడి వన్యప్రాణి అధికారులు హెచ్చరిస్తున్నారు. మొసళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం పెట్టకూడదని పేర్కొన్నారు. వాటి దగ్గరకు వెళ్లడం, పట్టుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థుల అద్భుతం.. మైదానంలో భారీ దీపం.. వీడియో వైరల్
ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్