డప్పుల దరువుకు అదిరిపోయే స్టెప్పులు వేసిన రోబోట్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ABN , Publish Date - Nov 03 , 2026 | 08:02 AM
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ రోబోట్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా.. ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రోబోలు అంటే మనకు యంత్రాల్లా ఒకే విధమైన కదలికలు చేస్తూ పనిచేసే పరికరాలుగానే గుర్తుకొస్తాయి. అయితే.. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోబోలు కూడా మనుషుల్లా వివిధ రకాల కదలికలు చేయగలుగుతున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ వైరల్ వీడియో.
ఇందులో 'ALEX' అనే పేరు ముద్రించిన టీ షర్టు ధరించిన ఓ రోబోట్ ఎర్ర తివాచీపై నిలబడి కనిపిస్తుంది. డప్పుల దరువుకు అనుగుణంగా రోబోట్ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. చేతులు పైకీ కిందకీ ఊపుతూ, కాళ్లను లయబద్ధంగా కదుపుతూ, శరీరాన్ని అటూ ఇటూ తిప్పుతూ వేసే స్టెప్పులు చూస్తుంటే నిజంగా ఓ మనిషి నృత్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. ముఖ్యంగా డప్పుల ప్రతి బీట్‌కు అనుగుణంగా రోబోట్ కదలికలు ఉండటం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రోబోట్ నృత్యాన్ని చూసేందుకు చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు వీడియోలో కనిపిస్తోంది.
కొందరు తమ స్మార్ట్ఫోన్లలో ఈ అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరిస్తుండగా.. మరికొందరు చప్పట్లు కొడుతూ రోబోట్‌ను ఉత్సాహపరుస్తున్నారు. సాధారణంగా సంప్రదాయ డప్పుల దరువుకు మనుషులు ఉత్సాహంగా నృత్యం చేయడం చూస్తుంటాం. కానీ అదే డప్పుల శబ్దానికి ఒక రోబోట్ ఇలా స్టెప్పులు వేయడం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. 'మనుషులే కాదు.. ఇప్పుడు రోబోలు కూడా డప్పుల దరువుకు అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నాయి' అని ఒకరు, 'ఇక పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయడానికి మనుషులతో పాటు రోబోలు కూడా వస్తాయేమో!' అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. కొంతమంది నెటిజన్లు 'టెక్నాలజీ నిజంగా మరో స్థాయికి చేరుకుంది' అంటూ సరదాగా స్పందిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి