కదులుతున్న విమానంలో నిలబడ్డ ప్రయాణికులు.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:57 PM
రన్‌వేపై కదులుతున్న విమానంలో కొందరు ప్రయాణికులు నిలబడ్డ వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: రన్‌వేపై కదులుతున్న విమానంలో కొందరు ప్రయాణికులు నిలబడ్డ వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదే విమానంలోని ఓ ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డు చేసి నెట్టింట షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా స్పందించింది.
అమితవ దాస్ అనే ప్యాసింజర్ ఈ వీడియోను షేర్ చేశారు. విమానం ల్యాండయ్యాక టర్మినల్ వైపు వెళుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం పూర్తిగా ఆగాక లేవాల్సిన వారు ముందే తొందరపాటుతో లేచి నిలబడ్డారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లల్లో నిలబడ్డట్టు వారు నిల్చోవడం చూసి అమితవ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘విమానం ఇంకా కదులుతూనే ఉంది. అయినా ప్యాసింజర్లు ఎలా నిలబడ్డారో చూడండి.. ఇదీ ప్రస్తుతం విమానంలో పరిస్థితి’ అంటూ ఆందోళనతో అమితవ వీడియోను షేర్ చేశారు. భద్రతా చర్యలను ప్రశ్నార్థకం చేసేలా పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పోస్టుపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ స్పందించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రతకే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. భద్రతా పరమైన ప్రోటోకాల్స్‌పై తమ సిబ్బందికి పూర్తి తర్ఫీదు ఉంటుందని కూడా భరోసా ఇచ్చింది. ఈ ఘటనపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలిపింది.
ఇక నెటిజన్లు కూడా ఈ ఉదంతంపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. విమానంలోని సిబ్బంది సూచనలు, మార్గదర్శకాలను ప్రయాణికులు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆఫీస్‌లో సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడు.. యువతి వీడియో వైరల్
బైక్‌పై బాణసంచాతో ఎంట్రీ.. పెళ్లిలో రైడర్ హంగామా! వీడియో వైరల్