పింఛను కోసం 90 ఏళ్ల అత్తను 9 కి.మీ. మోసిన కోడలు.. వీడియో వైరల్
ABN , Publish Date - May 24 , 2026 | 03:29 PM
ప్రభుత్వాలు డిజిటల్ విప్లవం గురించి, ఇంటి వద్దకే సంక్షేమ సేవల గురించి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయి. ఓ మహిళ తన అత్త పెన్షన్ కోసం ఏకంగా 9 కిలోమీటర్లు ఆమెను మోసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వాలు డిజిటల్ విప్లవం గురించి, ఇంటి వద్దకే సంక్షేమ సేవల గురించి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ప్రాథమిక సంక్షేమ సదుపాయాల కోసం మారుమూల ప్రాంతాల ప్రజలు ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో ఈ దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో.. ఓ మహిళ 90 ఏళ్ల అత్తను తన వీపుపై మోసుకుంటూ మండుటెండలో అటవీ మార్గంలో, వాగుల గుండా నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రాథమిక సంక్షేమ సదుపాయాల కోసం ఓ సామాన్య కుటుంబం చేస్తున్న నిత్య పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. స్థానికుల కథనాల ప్రకారం.. సుఖ్మానియా బాయి(55) అనే మహిళ తన అత్త సోన్‌వారీ(90)తో కలిసి నివసిస్తోంది. పేదరికంలో జీవిస్తున్న వీరికి సోన్‌వారీకి వచ్చే వృద్ధాప్య పెన్షన్ ఎంతో ఆసరగా నిలుస్తోంది. అయితే, సోన్‌వారీకి రావాల్సిన పింఛను సొమ్ము రూ.1500.. ఇ-కైవేసీ సమస్యల వల్ల 3 నెలలుగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు స్వయంగా బ్యాంకుకు వచ్చి వేలిముద్ర కానీ, గుర్తింపును ధ్రువీకరిస్తేనే పెన్షన్ ఇస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన అత్తకు పింఛను ఇప్పిండచం కోసం ఆమెను మోస్తూ.. మండుటెండలో 9 కిలోమీటర్ల మేర నడిచింది. ఎంతో ఆవేదన కలిగించే ఈ దృశ్యాలను దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
ప్రభుత్వం పదే పదే ఇంటి వద్దకే సేవలు, డిజిటల్ ఇండియా కార్యక్రమాల గురించి చెబుతున్నప్పటికీ.. మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులు, మంచానపడిన పెన్షనర్లు ధ్రువీకరణ కోసం ఇప్పటికీ ఎందుకు ఇలాంటి సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోందని చాలా మంది వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీతో మార్కో రుబియో భేటీ.. భారత్-అమెరికా సంబంధాలపై కీలక చర్చలు..
ఐపీఎల్ కంటే దేశవాళీ క్రికెట్ ఆడటమే కష్టం: ఎల్ఎస్‌జీ యువ ప్లేయర్