వామ్మో.. 80 ఏళ్ల వయసులో భార్య కోసం.. రోజుకు 16 గంటలు పాటు..
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:42 PM
దాదాపు 80 ఏళ్లకు చేరుకున్న ఒక పెద్దాయన తన భార్య కోసం ఇప్పటికీ రోజుకు 16 గంటల పాటు శ్రమిస్తున్న వైనం నెటిజన్లను కదిలిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు 80 ఏళ్ల వయసొచ్చినా కూడా ఒక పెద్దాయన రోజుకు 16 గంటల పాటు ట్యాక్సీ నడుపుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్న వైనం ప్రస్తుతం నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది. భార్య వైద్య ఖర్చుల కోసం ఆయన ఇప్పటికీ కోల్‌కతా నగర వీధుల్లో బతుకు పోరాటాన్ని సాగిస్తున్నారు. ఆత్మగౌరవం మూర్తిభవించినట్టు ఉన్న ఆ పెద్దయన ఉదంతాన్ని ఒక ప్రయాణికురాలు షేర్ చేశారు.
రవీంద్రనాథ్ సర్కార్ అనే వృద్ధుడి కష్టాలను చూసి చలించిపోయిన ప్రయాణికురాలు ఈ వీడియోను షేర్ చేశారు. ఆయన కారెక్కిన మహిళ ఆ పెద్దాయన కష్టాలను చూసి కదిలిపోయారు. వృద్ధుడు 54 ఏళ్లుగా డ్రైవర్‌గా చేస్తున్నారని చెప్పారు. ఆయన భార్య వయసు 67 ఏళ్లని, ఆమె అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చుల కోసం పెద్దాయనకు ఇప్పటికీ స్టీరింగ్ వీల్ పట్టకతప్పలేదని విచారం వ్యక్తం చేశారు. కోల్‌కతా నగరంలోని దమ్ దమ్ ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో ఆ వృద్ధ దంపతులు ఉంటున్నారు. వానా కాలంలో ఇంట్లోకి నీరు లీకవుతున్నా ఇంటికి రిపేర్లు కూడా చేయించుకోలేని దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని చెప్పారు.
వారికి సంతానం లేకపోవడంతో అవసాన దశలో ఆదుకునే వారే కరువయ్యారు. భార్య వైద్యం కోసం ఇప్పటికీ రవీంద్రనాథ్ రెయింబవళ్లు కష్టపడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ నిరంతరం పనిచేయాల్సిన దుస్థితిలో ఉన్నప్పటికీ ఆ పెద్దాయన ఎవరి ముందూ చేయిచాచరని కూడా మహిళ తెలిపారు. ప్రయాణికులు ఇచ్చింది తీసుకోవడమే తప్ప ఇంత కావాలని డిమాండ్ చేయని అభిమానంగల వ్యక్తి అంటూ కితాబునిచ్చారు. ఇంత కష్టపడుతున్నా వచ్చే ఆదాయం ఆ దంపతులకు సరిపోవట్లేదని ఆ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రోజు ప్రయాణికులు ఎవరూ రాకపోతే కారు ఓనర్‌కు అద్దె చెల్లించాల్సిన పరిస్థితిలో పెద్దాయన ఉన్నారని చెప్పారు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వృద్ధుడి ఆత్మస్థైర్యం గొప్పదని అనేక మంది ప్రశంసించారు. పెద్దాయనను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
డెలివరీ బాయ్‌పై చిరుత దాడి.. ఆ తర్వాత ఏమైందంటే..
కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్