డీ అడిక్షన్ సెంటర్‌లో కలకలం.. పారిపోవడానికి ప్రయత్నించిన రోగులు..
ABN , Publish Date - Feb 10 , 2026 | 09:46 AM
40 మంది పేషెంట్లు డీ అడిక్షన్ సెంటర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తలుపులు బద్దలు కొట్టి పారిపోయేందుకు చూశారు. ఓ పోలీస్ సమయస్పూర్తి, ధైర్య సాహసాల కారణంగా పేషెంట్లు బయటకు వెళ్లలేకపోయారు..
పంజాబ్‌లోని ప్రభుత్వ డీ అడిక్షన్ సెంటర్‌లో కలకలం చెలరేగింది. 40 మంది పేషెంట్లు డీ అడిక్షన్ సెంటర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తలుపులు బద్దలు కొట్టి పారిపోయేందుకు చూశారు. అయితే ఓ పోలీస్ సమయస్పూర్తి, ధైర్య సాహసాల కారణంగా పేషెంట్లు బయటకు వెళ్లలేకపోయారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ అమ్మకం, వినియోగానికి వ్యతిరేకంగా ‘వార్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ క్యాంపైన్ నిర్వహిస్తోంది. ఎన్‌డీపీఎస్ సెక్షన్ 27 కింద డ్రగ్స్ వాడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
అయితే, డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన వారిని పోలీసులు జైలుకు కాకుండా డీ అడిక్షన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం 40 మంది మొహాలీలోని ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం పేషెంట్లు అందరూ ఆగ్రహానికి గురయ్యారు. అక్కడినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా అందరూ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చారు. డోర్ బద్దలు కొట్టి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. డోర్ బయటి వైపు ఉన్న పోలీస్ అప్రమత్తమయ్యాడు. డోర్ తెరుచుకోకుండా హ్యాండిల్స్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.
పేషెంట్లు మరింత ఆగ్రహానికి గురయ్యారు. కాళ్లు, చేతులతో డోర్‌పై దాడి చేయటం మొదలెట్టారు. సెక్యూరిటీ గార్డుకు సాయంగా మరికొంతమంది డోర్ దగ్గరకు వచ్చారు. డోర్ తెరుచుకోకుండా గట్టిగా పట్టుకున్నారు. డోర్ ఎంతకీ తెరుచుకోకపోవటంతో పేషెంట్లు నిరాశ చెందారు. చేసేదేమీ లేక అక్కడినుంచి లోపలికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ సంఘటనపై పోలీస్ అధికారి అమన్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక్క పేషెంట్ కూడా పారిపోలేదు. వారు పారిపోయేందుకు ప్రయత్నం మాత్రమే చేశారు. కొన్ని రకాల మెడిసిన్స్ కారణంగా రోగులు అలా మితిమీరి ప్రవర్తిస్తూ ఉంటారు’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా వీసా నిబంధనల్లో పెనుమార్పులు
మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ చెట్టుపై పక్షి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!