చిన్న తప్పుతో కోటి అప్పు.. యువకుడి జీవితం తలకిందులు..
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:42 PM
అవగాహన లేకుండా చేసిన ఓ చిన్న తప్పు ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. 25 ఏళ్ల వయసులో బిజినెస్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న అతడి కల చెదిరిపోయింది. సాఫీగా సాగుతున్న బిజినెస్ అట్టర్ ప్లాప్ కావటమే కాకుండా కోటి రూపాయల అప్పులు మిగిలాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: అవగాహన లేకుండా చేసిన ఓ చిన్న తప్పు ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. 25 ఏళ్ల వయసులో బిజినెస్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న అతడి కల చెదిరిపోయింది. సాఫీగా సాగుతున్న బిజినెస్ అట్టర్ ప్లాప్ కావటమే కాకుండా కోటి రూపాయల అప్పులు మిగిలాయి. ఆ యువకుడు బాధాకరమైన తన బిజినెస్ అనుభవాన్ని రెడ్డిట్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. అప్పుల నుంచి బయటపడ్డానికి ఏం చేయాలో సలహా ఇవ్వమని కోరుతున్నాడు. ఆ యువకుడు తన పోస్టులో తెలిపిన వివరాల మేరకు..
భారత్‌కు చెందిన 25 ఏళ్ల ఆ యువకుడు 2021 నుంచి 2023 వరకు ఓ బీపీఓ కంపెనీలో పని చేశాడు. అనుకోని కారణాల వల్ల అతడి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత బిజినెస్ మీద ఆసక్తితో అటు వైపు అడుగులు వేశాడు. తెలిసిన వాళ్ల దగ్గరి నుంచి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకుని 2023లో ఓ చిన్న క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టాడు. ఆ క్లౌడ్ కిచెన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తన బిజినెస్‌ను విస్తరించాలని ఆ యువకుడు అనుకున్నాడు. అధిక వడ్డీలకు కోటి రూపాయలు అప్పు చేసి బిజినెస్‌ను విస్తరించాడు. అదే అతడి పాలిట శాపంలా మారింది.
బిజినెస్ బాగానే నడుస్తున్నా.. అప్పులు కట్టడం పెను భారంగా మారింది. వడ్డీల కారణంగా వచ్చిన ఆదాయం ఆవిరవసాగింది. అప్పుల దెబ్బకు 25 కేజీల బరువు తగ్గాడు. యువకుడి పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తల్లి పుట్టింటి వారు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. 30 లక్షల రూపాయలు ఇచ్చారు. వ్యాపారం ఆపేయమని యువకుడికి చెప్పారు. ఇప్పుడు అతడికి 70 లక్షల రూపాయల అప్పు ఉంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అతడు అల్లాడిపోతున్నాడు.
అతడు తన పోస్టులో.. ‘నేను మార్టిగేజ్ లోన్ మీద టాప్ అప్ తీసుకోవటం మంచిదేనా? లేదా పూర్తిగా బిజినెస్ మానేసి జాబ్ చేసుకోమంటారా? అదే మీరు గనుక నా పరిస్థితిలో ఉండి ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు. 70 లక్షల రూపాయల అప్పు నుంచి ఎలా బయటపడేవారు. మంచి సలహా ఉంటే ఇవ్వండి’ అని కోరాడు.
ఇవి కూడా చదవండి
డిగ్రీ పూర్తి చేశారా? SBIలో 7,150 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
పీఓకేలో ఉద్రిక్తత.. కశ్మీర్‌లో జోజిలా సంబరాలు