డిగ్రీ పూర్తి చేశారా? SBIలో 7,150 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:11 PM
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న నియామక ప్రక్రియలో దరఖాస్తుల గడువును జూన్ 15 వరకు పొడిగించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఎస్‌బీఐ (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న నియామకాల్లో దరఖాస్తు గడువును పొడిగించింది. జూన్ 8తో ముగియాల్సిన దరఖాస్తుల ప్రక్రియను ఇప్పుడు జూన్ 15, 2026 వరకు పొడిగించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
భారీగా ఖాళీలు
ఎస్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 7,150 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 709, తెలంగాణలో 491 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ అందించడంతో పాటు నెలకు రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తారు.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వంటి నైపుణ్యాలు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా స్థానిక భాషా పరీక్ష కూడా నిర్వహిస్తారు.
వయోపరిమితి
2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం
అభ్యర్థులకు ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో సాధించిన మార్కులు, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, గుంటూరు, నెల్లూరు తదితర నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ (NAPS) (www.apprenticeshipindia.gov.in)లో పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం ఎస్‌బీఐ అధికారిక కెరీర్ పోర్టల్ (sbi.bank.in/web/careers లేదా sbi.bank.in/web/careers/current-openings) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను పూర్తి చేయాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 15, 2026
ఆన్‌లైన్ పరీక్ష: జులై 2026 నెలలో ఉండవచ్చు
బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌కు బలమైన పునాది వేసుకోవాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
Also Read:
వేప ఆకులే కాదు.. పండు కూడా ఔషధమే!
పిల్లల భవిష్యత్తును మార్చే అలవాట్లు ఇవే