Share News

కెనడాలో 26 ఏళ్ల భారత సంతతి మహిళ నవ్‌నీత్ కౌర్ హత్య

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:38 PM

కెనడాలోని టొరంటో నగరంలో 26 ఏళ్ల భారత సంతతికి చెందిన నవ్‌నీత్ కౌర్ అనే యువతిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, హలో.. అంటూ పలకరించి దుండగుడు కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది.

కెనడాలో 26 ఏళ్ల భారత సంతతి మహిళ నవ్‌నీత్ కౌర్ హత్య
Indian-Origin Woman Navneet Kaur Killed in Toronto

ఒట్టావా, జులై 27: కెనడాలోని టొరంటో నగరంలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల భారత సంతతికి చెందిన నవ్‌నీత్ కౌర్ అనే యువతిని ఓ వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన దాడి అని టొరంటో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


హలో.. అంటూ మాటలు కలిపి కాల్చేశాడు

శుక్రవారం ఉదయం 7:23 గంటల ప్రాంతంలో హంబర్‌వుడ్ బౌలేవర్డ్, రెక్స్‌డేల్ బౌలేవర్డ్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం కాఫీ తాగుతూ బయట కూర్చున్న ప్రత్యక్షసాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. నవ్‌నీత్ కౌర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, సదరు వ్యక్తి ఆమెను అనుసరించాడు. అతడు ఏదో మాట్లాడటంతో నవ్‌నీత్ వెనక్కి తిరిగి చూసింది. వారిద్దరి మధ్య స్వల్ప సంభాషణ జరిగింది. ఎలాంటి గొడవ లేదా వివాదం జరిగిన సూచనలు కనిపించకుండానే, అతడు వెంటనే తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన నవ్‌నీత్‌కు అత్యవసర వైద్య సాయం అందించినప్పటికీ, ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది.


డ్రోన్లు, కె-9 డాగ్ స్క్వాడ్‌తో జల్లెడ.. అనుమానితుడి అరెస్ట్

ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన టొరంటో పోలీసులు, నిందితుడిని పట్టుకోవడానికి డ్రోన్లు, ప్రత్యేక డాగ్ స్క్వాడ్ (K9 Unit) సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నాటికి ఈ హత్య కేసులో నిందితుడైన 37 ఏళ్ల శరంజిత్ సింగ్ అనే వ్యక్తిని బ్రాంప్టన్ వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. నిందితుడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ (ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య), కోర్టు నిబంధనలను ఉల్లంఘించినట్లు కేసులు నమోదు చేశారు.


ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు

హత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల హోమిసైడ్ టీమ్ (హత్యల దర్యాప్తు విభాగం) విచారణ జరుపుతోంది. ఈ దాడిలో ఇతర నిందితుల ప్రమేయం ఏమీ లేదని, ఇది పూర్తిగా టార్గెటెడ్ దాడిగా భావిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు తెలపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 12:57 PM