ఛార్లెట్‌లో తానా త్రోబాల్, వాలీబాల్ టోర్నమెంట్లకు భారీ స్పందన
ABN , Publish Date - Aug 26 , 2026 | 07:45 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియాన్ విభాగం ఆధ్వర్యంలో ఛార్లెట్‌లో ఆగస్టు 22న పురుషుల వాలీబాల్ టోర్నమెంట్, మహిళల ఇంటర్నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియాన్ విభాగం ఆధ్వర్యంలో ఛార్లెట్‌లో ఆగస్టు 22న పురుషుల వాలీబాల్ టోర్నమెంట్, మహిళల ఇంటర్నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో 325 మంది క్రీడాకారులు, 25 మంది రిఫరీలు పాల్గొన్నారు.

NAFT-TANA నేషనల్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కూ మంచి స్పందన వచ్చింది. తానా, ఎన్‌ఏఎఫ్‌టీ కలిసి టోర్నమెంట్ నిర్వహించడం ఇది 3వ సారి. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న మహిళా టీమ్‌లు చూపిన ప్రతిభ, ఉత్సాహం, స్ఫూర్తి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రెండు టోర్నమెంట్లకు వచ్చిన ఆదరణ, అభిమానుల ఉత్సాహంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. 50 మంది వలంటీర్లు ఈ టోర్నమెంట్‌ల విజయానికి కృషి చేశారు. తానా జాతీయ నాయకులు ఈ టోర్నమెంట్‌కు హాజరుకావడంతో పాటు పోటీలను నిర్వహించిన తానా అప్పలాచియాన్ నాయకులను అభినందించారు.

ఈ కార్యక్రమం కోసం ఎన్నో గంటలు ప్లానింగ్, కో-ఆర్డినేషన్, కష్టపడి పనిచేసిన నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరి, రవి (నాని) వడ్లమూడిని పలువురు అభినందించారు. తానా నేషనల్ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీ శివ చావా కార్యక్రమానికి విచ్చేసి, ఈ వేడుకకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చారు. ఈ క్రీడా వేడుక విజయవంతం కావడానికి విలువైన సహకారం అందించిన స్పాన్సర్లకు, వలంటీర్లకు తానా అప్పలాచియాన్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.

