Share News

డల్లాస్‌లో ATA ఫండ్‌రైజర్ కార్యక్రమం ఘన విజయం

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:30 PM

డల్లాస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫండ్‌రైజర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాబోయే ATA 19వ మహాసభల నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించగా, స్థానిక తెలుగు సమాజం పెద్దఎత్తున పాల్గొంది.

డల్లాస్‌లో ATA ఫండ్‌రైజర్ కార్యక్రమం ఘన విజయం
ATA Dallas Fundraiser Event

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 24, 2026న డల్లాస్‌లోని ఫ్రిస్కోలో శుభం ఈవెంట్ సెంటర్‌లో ఫండ్‌రైజర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. త్వరలో జరగబోయే ATA 19వ మహాసభలకు ముందస్తు కార్యక్రమంగా దీనిని నిర్వహించారు. ఈ మహాసభలు జులై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగనున్నాయి. కిక్‌ఆఫ్ ఈవెంట్స్ ద్వారా తెలుగు సమాజాన్ని ఒకచోటికి తీసుకురావడం, రాబోయే కార్యక్రమాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ATA (3).jpg


ఈ కార్యక్రమం ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కో-కన్వీనర్, ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ అరవింద్ రెడ్డి ముప్పిడి, జాయింట్ సెక్రటరీ శారద సింగిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు రఘువీర్ మరిపెద్ది, అనిల్ బొద్దిరెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్స్, స్టాండింగ్ కమిటీ అడ్వైజర్స్, స్టాండింగ్ కమిటీ చైర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రార్థన గీతం, జ్యోతి ప్రజ్వలనం‌తో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం స్థానిక కళాకారులు సంగీతం, నృత్యాలతో ఆకట్టుకున్నారు.

ATA (4).jpg


ATA అధ్యక్షులు జయంత్ చల్లా మాట్లాడుతూ, ATA 36 ఏళ్ల క్రితం స్థాపించిన గొప్ప సంస్థ అని పేర్కొన్నారు. స్థాపన నుంచి నేటి వరకు ఆటా అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ, కళాకారులకు వేదికను కల్పించి వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన విశిష్ట సంస్థగా నిలిచిందని తెలిపారు. ఆటా కేవలం సాహిత్యం, సంగీతం వంటి కళలకే పరిమితం కాకుండా ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యా–వ్యాపార సెమినార్లు, మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.

ATA (2).jpg

అలాగే అమెరికా వ్యాప్తంగా ఆటా సేవా కార్యక్రమాలు విస్తరించాయని, రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ తెలుగు వారిని ఒకచోట కలిపి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహాసభలను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న 19వ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్‌కు అందరినీ ఆహ్వానించారు.

ATA (5).jpg


ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ATA ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారత్‌లోని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్య, విద్యా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్‌తో కలిసి బాధితులకు ఆర్థిక సహాయం అందించడం, విద్యార్థులు, కుటుంబాలకు అవసరమైనప్పుడు తక్షణ సహాయం అందిస్తూ, ఇండియన్ కాన్సులేట్‌తో సమన్వయం చేసుకుంటూ వేగంగా స్పందిస్తున్న సంస్థగా ఆటా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు ఆశించినదానికన్నా ఎంతో ఎక్కువగా, విశేష స్పందనతో దాతలు ముందుకు రావడం అత్యంత ఆనందదాయకమన్నారు. ఈ మహత్తర సహకారం ఈ కార్యక్రమ విజయానికి బలమైన పునాది అయిందన్నారు. ప్రతి దాతకు పేరుపేరునా ఆటా కార్యవర్గ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు.

ATA (1).jpg

జూన్ 21, 2026న స్థానిక కళాకారుల కోసం సంగీతం, నృత్యం, పేజెంట్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి ఈసారి కన్వెన్షన్ మెగా స్టేజ్‌పై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించనుందన్నారు. ఆటా కార్యవర్గ బృందం స్వప్న తుమ్మపాల, శ్యామ్ మలసాల, సాహితి మూట, రామ్ అన్నాడి, అశోక్ పొద్దుటూరి, రామ్ కాసర్ల, శ్రీనివాస్ రెడ్డి కేలం, సత్య పెర్కారి, వేణు తనికెల్ల, మంజుల ముప్పిడి, హరిత కేలం, హర్షదా ఆర్య మాసెట్టి, సుమా ముప్పాల, మంజులా కునాడి తదితరులు కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

ATA (6).jpg

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంఘ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొని తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు, సభ్యులు ఈ వేడుకను ప్రశంసించారు. ఈ కార్యక్రమం రాబోయే ATA 19వ కాన్ఫరెన్స్, యువత సమ్మేళనానికి కిక్-ఆఫ్‌గా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రీజినల్ కోఆర్డినేటర్ శ్యామ్ మలసాల సహాయం సహకారం అందించిన సౌండ్ ఓ రామా, దేశి చౌరస్తా, శుభం ఈవెంట్ సెంటర్‌ యాజమాన్యానికి, అలాగే విచ్చేసిన అతిథులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


Also Read:

డబ్లిన్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ప్రభుత్వం, ప్రవాసుల మధ్య వారధి జయరాం: నోరి దత్తాత్రేయుడు

For More Latest News

Updated Date - Apr 28 , 2026 | 01:48 PM