Share News

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు.

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు
APTS Chairman Mannava Mohana Krishna

  • కూటమి ప్రభుత్వం విధానాలతో టెక్నాలజీ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం

  • క్వాంటం వ్యాలీతో అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళిక

  • గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు విస్తృత అవకాశాలు

  • ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి

  • కొత్త పెట్టుబడులతో రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు


అమెరికా (న్యూజెర్సీ): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

APTS Chairman Mannava Mohana Krishna


క్వాంటం వ్యాలీతో అమరావతికి కొత్త గుర్తింపు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక టెక్నాలజీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయనున్న ‘క్వాంటం వ్యాలీ’ రాష్ట్ర టెక్నాలజీ ప్రస్థానంలో కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, పరిశోధన, ఆవిష్కరణల వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ఇది వేదికగా మారనుందని తెలిపారు. 'చంద్రబాబు నాయకత్వంలో గతంలో హైదరాబాద్ ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇప్పుడు అదే దార్శనికతతో అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీకి కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం మన ముందుంది. క్వాంటం వ్యాలీ ఈ ప్రయాణంలో కీలక భాగం' అని మన్నవ మోహన కృష్ణ అన్నారు.


ప్రపంచ టెక్నాలజీ సంస్థలకు ఏపీ ఆహ్వానం

అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, అమరావతి అభివృద్ధి, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏపీని పెట్టుబడులకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తున్నాయని మోహన కృష్ణ తెలిపారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార అనుభవాన్ని, పెట్టుబడులను రాష్ట్రంతో అనుసంధానం చేసుకోవాలని కోరారు. 'ప్రపంచ స్థాయిలో మీరు సాధించిన అనుభవం, పరిజ్ఞానం ఏపీకి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను విస్తరించండి. ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుంది. మీ పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి' అని మోహన కృష్ణ పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, వేగవంతమైన అనుమతులు, పరిశ్రమలకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మోహన కృష్ణ వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వేగంగా చేపడుతున్న అభివృద్ధి, టెక్నాలజీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యంపై అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేశారన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు.. రాష్ట్రంలో టెక్నాలజీ రంగానికి కొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయని పేర్కొంటూ, ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు.

APTS Chairman Mannava Mohana Krishna


ఇవీ చదవండి:

తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’

డల్లాస్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం

Updated Date - Aug 21 , 2026 | 05:56 PM