ధ్యాస, ధ్యానం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:54 AM
ఇక్యూ సుప్రసిద్ధుడైన ఒక జెన్ గురువు. గౌతమబుద్ధుడు అంటే ఆయనకు అపరిమితమైన భక్తి, ప్రేమ. బుద్ధుణ్ణి తలచుకొని తరచుగా భావోద్వేగానికి గురయ్యేవాడు....
సద్బోధ
ఇక్యూ సుప్రసిద్ధుడైన ఒక జెన్ గురువు. గౌతమబుద్ధుడు అంటే ఆయనకు అపరిమితమైన భక్తి, ప్రేమ. బుద్ధుణ్ణి తలచుకొని తరచుగా భావోద్వేగానికి గురయ్యేవాడు. కన్నీరు కార్చేవాడు, ఆనందబాష్పాలు రాల్చేవాడు. కానీ అతను నివసించే కుటీరంలో బుద్ధుడి పటం కానీ, విగ్రహం కానీ ఉండేది కాదు.
ఒకసారి కొందరు సైనికులు వచ్చి, అతని కుటీరంలో ఒక రాత్రంతా గడిపారు. బుద్ధుడి గురించి ఇక్యూ చెప్పిన మాటలు విన్నారు. అంత భక్తి ఉన్న వ్యక్తి... కనీసం బుద్ధుడి విగ్రహం ఒక్కటయినా తన కుటీరంలో ఎందుకు పెట్టుకోలేదని ఆశ్చర్యపోయారు. ‘‘అయ్యా! మా దగ్గర బుద్ధుడి పటం ఒకటి ఉంది. మీకు ఇవ్వాలనుకుంటున్నాం. తీసుకోండి’’ అని అభ్యర్థించారు. అప్పుడు ఇక్యూ ‘‘మీ పటాన్ని మీరే తీసుకువెళ్ళండి. ఇక్కడ ఇద్దరు ఉండే స్థలం ఎక్కడుంది?’’ అన్నాడు. ఇక్యూ దృష్టిలో అక్కడ ఉన్నది బుద్ధుడొక్కడే. ‘ఇక్యూ అనేవాడు ప్రత్యేకంగా లేడు’ అనేది అతని ఉద్దేశం.
ఇక్యూ బోధన, శిక్షణ పద్ధతులు, ప్రవర్తన వింతగా ఉండేవి. ఏళ్ళ తరబడీ ఇక్యూ బోధనలను ఆచరిస్తున్న ఒక శిష్యుడు ఉండేవాడు. ఒక రోజు భారీ వర్షంలో తడుస్తూ వచ్చిన ఆ శిష్యుడు... ఇక్యూ గది బయట చెప్పులను వదిలి, ఆ పక్కనే గొడుగును పెట్టి లోపలికి వెళ్ళాడు. ఇక్యూకు నమస్కరించాడు. అప్పుడు ఇక్యూ ‘‘నువ్వు నీ గొడుగును, చెప్పులను ఎటు పెట్టి వచ్చావు? కుడివైపా, ఎడమవైపా?’’ అని ప్రశ్నించాడు. ఊహించని ఆ ప్రశ్న శిష్యుణ్ణి దిగ్ర్భాంతికి గురి చేసింది. ఎందుకంటే అతను ఆ విషయం మీద ధ్యాస ఉంచలేదు. ‘సాధన ఎలా సాగుతోంది? అని కానీ, నీకు ఏవైనా సందేహాలున్నాయా?’’ అని కానీ అడగకుండా... చెప్పులు, గొడుగు గురించి ప్రశ్నించడమేమిటి?’ అనుకున్నాడు ఆ శిష్యుడు.
ఏదైనా పని చేస్తున్నప్పుడు... అది పెద్దదైనా, చిన్నదైనా స్పృహతో, శ్రద్ధతో చేయాలి. అతను పాదరక్షలను, గొడుగును వదిలేయడం అనేది యాంత్రికంగా చేశాడా, జాగ్రత్తగా చేశాడా? అనేది తెలుసుకోవాలన్నదే ఇక్యూ ఉద్దేశం. ఇక్యూ అడిగిన ప్రశ్నకు ఆ శిష్యుడు ఇచ్చే సమాధానమే అతను సాధనలో ఏ స్థాయిలో ఉన్నాడో స్పష్టం చేస్తుంది. అయితే శిష్యుడి నుంచి సమాధానం స్పష్టమైన రాలేదు. అప్పుడు ఇక్యూ ‘‘నువ్వు మరో ఎనిమిదేళ్ళు సాధన చెయ్యాలి’’ అన్నాడు. ‘‘ఇంత చిన్న పొరపాటుకు అంత పెద్ద శిక్ష వేయాలా?’’ అని అడిగాడు శిష్యుడు..‘‘ పొరపాటు చిన్నాదా, పెద్దదా అనేది కాదు... ధ్యానం, ధ్యాస ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం’’ అన్నాడు ఇక్యూ.
రాచమడుగు శ్రీనివాసులు
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News