త్రిలోక శోక హారిణి
ABN , Publish Date - May 29 , 2026 | 01:57 AM
మానవుల మనుగడలో నదులది ఎనలేని పాత్ర. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైన నాగరికతలు నదీ తీరాల్లోనే విలసిల్లాయి. అందుకే నదులను ‘మాతృదేవతలు’గా భారతీయ సంస్కృతి...
జూన్ 2 నుంచి 13 వరకు... యమునా నది పుష్కరాలు
మానవుల మనుగడలో నదులది ఎనలేని పాత్ర. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైన నాగరికతలు నదీ తీరాల్లోనే విలసిల్లాయి. అందుకే నదులను ‘మాతృదేవతలు’గా భారతీయ సంస్కృతి ఆరాధించింది. మనుషులకు ప్రాణాధారమైన ఆ నదులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పుష్కరాలను నిర్వహించుకొనే సంప్రదాయాన్ని ఏర్పరచింది. దేశంలోని పన్నెండు ప్రధాన నదులను పుష్కర నదులుగా నిర్ణయించి, ఒక్కొక్క నదికీ పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కరాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు... ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది కర్కాటక రాశిలో గురు ప్రవేశం సందర్భంగా... యమునా నది పుష్కరాలు జరగబోతున్నాయి.
సూర్యపుత్రి, యమ సోదరి: ప్రయాగ్‌రాజ్‌లో సంగమించే త్రివేణుల్లో (మూడు నదుల్లో) ఒకటైన యమునా నదికి పౌరాణికంగానూ ఎంతో ప్రశస్తి ఉంది. శ్రీకృష్ణుని లీలా విలాసాలకు కేంద్రంగా ఈ నదిని శ్రీమద్భాగవతం రమణీయంగా వర్ణించింది. యమునను సూర్యభగవానుడి కుమార్తెగా, యముడి సోదరిగా పురాణాలు పేర్కొన్నాయి. కాబట్టి యమునా స్నానం వల్ల సూర్యానుగ్రహం లభిస్తుందని, యమ బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర దినాల్లో సంకల్ప పూర్వకంగా యమునలో స్నానం చేసి, పిండ ప్రదానాలు, తర్పణాలు , దాన ధర్మాలు చేస్తే పితృ దేవతలు తృప్తి చెందుతారని, అభీష్టాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదిశంకరులు తన ‘యమునాష్టకం’లో ఈ నదిని ‘త్రిలోక శోక హారిణి’గా అభివర్ణించారు. ఆ అష్టకాన్ని పఠిస్తూ స్నానం చేసి, అనంతరం జపాదులు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయనేది పెద్దల మాట.
పుష్కర స్నానం చేసే ప్రదేశాలు:
ఉత్తరాఖండ్‌లో యమునానది పుట్టిన చోటైన యమునోత్రిలో. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ స్థలమైన (త్రివేణీ సంగమం) ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో. శ్రీకృష్ణుడు పుట్టిన ఊరైన మధురలో, ఆయన కంసుణ్ణి సంహరించిన తరువాత విశ్రమించాడని చెప్పే విశ్రామ్ ఘాట్‌లో. కేశి అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన బృందావనంలోని కేశీ ఘాట్ దగ్గర. డెహ్రాడూన్ జిల్లాలోని డాక్ పత్తర్ ఘాట్‌లో. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్, వజీరాబాద్ తదితర ఘాట్లలో. ఆగ్రాలోని దసరా ఘాట్, కైలాస్ ఘాట్ తదితర ప్రదేశాల్లో.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News