ధ్వజస్తంభాలు ఎందుకుంటాయి?
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:24 AM
దేవాలయంలో ప్రవేశించగానే... ఆ ఆవరణలో ధ్వజస్తంభం సమున్నతంగా కనిపిస్తుంది. ఆలయాల్లో విధిగా వీటిని ప్రతిష్ఠించాలనే ఆచారం వెనుక పౌరాణికమైన కథ ఒకటి ఉంది. మయూరధ్వజుడు... మణిపుర పాలకుడు. అతను మహా పరాక్రమశాలి, గొప్ప దానశీలి.
దేవాలయంలో ప్రవేశించగానే... ఆ ఆవరణలో ధ్వజస్తంభం సమున్నతంగా కనిపిస్తుంది. ఆలయాల్లో విధిగా వీటిని ప్రతిష్ఠించాలనే ఆచారం వెనుక పౌరాణికమైన కథ ఒకటి ఉంది.
మయూరధ్వజుడు... మణిపుర పాలకుడు. అతను మహా పరాక్రమశాలి, గొప్ప దానశీలి. అతని కుమారుడు తామ్రధ్వజుడు. పాండవులు అశ్వమేధయాగం చేసినప్పుడు... మణిపురంలో ప్రవేశించిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడు బంధించాడు. ఆగ్రహించిన పాండవులు అతనితో యుద్ధానికి దిగారు. భీమార్జున, నకుల సహదేవులను మయూరధ్వడుజు ఓడించాడు. తన తమ్ముళ్ళు ఓడిపోయిన సంగతి తెలిసి... ధర్మరాజే స్వయంగా బయలుదేరబోయాడు. అతణ్ణి శ్రీకృష్ణుడు వారిస్తూ... మయూరధ్వజుణ్ణి ఓడించే ఉపాయాన్ని చెప్పాడు.
దానంగా అర్ధ శరీరం
దాని ప్రకారం... శ్రీకృష్ణుడు, ధర్మరాజు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురాన్ని చేరుకున్నారు. వారికి మయూరధ్వజుడు ఆహ్వానం పలికాడు. దానంగా ఏది కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు... ‘‘మహారాజా! మేము మిమ్మల్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటే... దారిలో ఒక మృగరాజు ఇతని కుమారుడిపై దాడి చేసింది. అప్పుడు మేము అన్నెం పున్నెం ఎరుగని బాలుణ్ణి విడిచిపెట్టాలని మృగరాజును ప్రార్థించాం. ఆ మృగరాజు విచిత్రంగా మానవ భాషలో మాట్లాడుతూ ‘‘ఈ బాలుడు మీకు దక్కాలంటే... మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుడి శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించండి’’ అని అడిగింది. దానకర్ణులైన మీరు మాపట్ల దయతో... మీ శరీరంలోని సగం దానమిస్తే... ఆ పసిబాలుణ్ణి రక్షించుకోగలుగుతాం’’ అన్నాడు. ఆ మాటలు విన్న మయూరధ్వజుడు రెండో ఆలోచన లేకుండా తన శరీరాన్ని దానం చేయడానికి ఒప్పుకున్నాడు.
ఎడమ కంట నీరు
అప్పుడు శ్రీకృష్ణుడు ‘‘తమరి భార్యాపుత్రులే మీ శరీరాన్ని స్వయంగా కోసి ఇవ్వవలసి ఉంటుంది’’ అనే నియమాన్ని విధించాడు. దానికి కూడా మయూరధ్వజుడు అంగీకరించి... అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. తన కుడివైపు శరీరాన్ని త్యాగం చెయ్యడానికి సిద్ధమై కూర్చున్నాడు. మయూరధ్వజుడి భార్యాపిల్లలు కూడా... గుండె నిబ్బరం చేసుకొని, అతను ఆదేశించిన కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. దానధర్మాల్లో గొప్పవాడైన ధర్మరాజు సైతం... మయూరధ్వజుడి దానగుణానికి నివ్వెరపోయాడు. అంతలో మయూరధ్వజుడి ఎడమకన్ను నుంచి నీరు రావడం గమనించి... ‘‘తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు’’ అన్నాడు ధర్మరాజు. ‘‘మహాత్మా! మీరు పొరపడుతున్నారు. నేను చింతిస్తూ, బాధపడుతూ, వేదన చెందుతూ నా శరీరాన్ని మీకు దానంగా ఇవ్వడం లేదు. నా కుడిభాగం పరోపకారానికి ఉపయోగపడబోతోంది. ‘ఆ భాగ్యం నాకు కలగడం లేదు కదా!’ అని ఎడమ కన్ను ఎంతో బాధపడుతోంది’’ అని వివరించాడు.
దైవ సన్నిధిలో శాశ్వతంగా...
మయూరధ్వజుడి దానశీలతకు శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఉప్పొంగిపోయారు. తమ నిజరూపాలను ప్రదర్శించారు. ‘‘నీ దాన నిరతిని మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’’ అన్నాడు శ్రీకృష్ణుడు. వారిని చూసిన ఆనందంతో మయూరధ్వజుడు ఉక్కిరిబిక్కిరవుతూ ‘‘పరమాత్మా! నా ఈ శరీరం అశాశ్వతమయినది. ఈ శరీరం నశించినా, నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా... నిత్యం మీముందు ఉండేలా దీవించండి’’ అని చేతులు జోడించి వేడుకున్నాడు. ‘‘మయూరధ్వజా! తథాస్తు! నేటి నుంచి భూలోకంలో ప్రతి దేవాలయం ముందు నీ పేరుతో ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ చిరంజీవియై... నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందుగా నిన్ను దర్శించి, ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తరువాతే... భక్తులు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతి నిత్యం నీ దగ్గర ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ శిరస్సున ఉంచిన దీపం రాత్రి వేళల్లో బాటసారులకు దారి చూపిస్తుంది’’ అని శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాల ప్రతిష్ఠ ఆచారంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు