Share News

కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:33 AM

డాక్టర్‌! మా వారికి మద్యం అలవాటు లేదు. అయినా కాలేయానికి క్యాన్సర్‌ సోకింది. ఏ సందర్భాల్లో కాలేయం క్యాన్సర్‌కు గురవుతుంది? ఎవరు అప్రమత్తంగా ఉండాలి?...

కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మా వారికి మద్యం అలవాటు లేదు. అయినా కాలేయానికి క్యాన్సర్‌ సోకింది. ఏ సందర్భాల్లో కాలేయం క్యాన్సర్‌కు గురవుతుంది? ఎవరు అప్రమత్తంగా ఉండాలి? నివారణోపాయాలున్నాయా?

ఓ సోదరి, హైదరాబాద్‌.

కాలేయంలో తలెత్తే ప్రతి కణితి క్యాన్సర్‌ కావచ్చు, కాకపోవచ్చు. సాధారణంగా కాలేయ క్యాన్సర్‌కూ మద్యానికీ ముడిపెడుతూ ఉంటారు. కానీ మద్యం అలవాటు లేని వారికి కూడా కాలేయ క్యాన్సర్‌ సోకే ముప్పు ఉంటుంది. వివిధ కారణాలతో కాలేయం జబ్బుపడినప్పుడు ఆ వ్యాధికారక ప్రాంతాల నుంచి క్యాన్సర్‌ తలెత్తుతుంది. లివర్‌ పాడయ్యే అలాంటి పరిస్థితుల్లో ఒకటి సిర్రోసిస్‌.

ప్రధాన క్యాన్సర్‌ కారకాలు...

విపరీతమైన మద్యపానం, హెపటైటిస్‌ బి, సి ఇన్‌ఫెక్షన్లు, పుట్టుకతో వెంట తెచ్చుకునే లోపాలతో కాలేయం వ్యాధిగ్రస్థమవుతుంది. పిల్లల్లో జన్యుమార్పిడి సిర్రోసి్‌సకు దారితీసి క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. 3 నుంచి 5 ఏళ్ల వయసు పిల్లల్లో తలెత్తే ఈ వ్యాధిని హెపటోబ్లాస్టోమా అంటారు. క్యాన్సర్‌ పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. రోగలక్షణం కనిపించిన వెంటనే జాగ్రత్తపడాలి. కడుపు ఎడమ వైపు నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, వ్యాధి తీవ్రత పెరిగి కామెర్లు రావడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలలో రక్తం పోవడం, కడుపులో నీరు చేరడం, ఊబకాయం వంటి లక్షణాలు కాలేయ క్యాన్సర్‌లో ప్రధానంగా కనిపిస్తాయి.

పరీక్షలు - చికిత్సలు

లివర్‌ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులు (తీవ్ర మద్యపానం అలవాటు ఉన్నవారు) అలా్ట్రసౌండ్‌, సీరం ఎ.ఎ్‌ఫ.పి పరీక్షలతో కాలేయ కేన్సర్‌ను గుర్తించవచ్చు. వీటితో పాటు సిటి స్కాన్‌, ఎమ్మారై, బయాప్సీలతో కూడా క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ చికిత్సకు ఆపరేషన్‌ అవసరం అవుతుంది. వ్యాధి సోకిన ప్రాంతాన్ని గుర్తించి, తొలగిస్తారు. దీన్నే హెపక్టమీ అంటారు. ఓపెన్‌ పద్ధతితో పాటు లాప్రోస్కోపిక్‌ కూడా అనుసరిస్తున్నారు. ఈ ఆధునిక పద్ధతిలో సర్జరీ సులభంగా, సురక్షితంగా చేసే వీలుంటుంది. రోగి కూడా త్వరగా కోలుకుంటాడు. సర్జరీ తట్టుకోలేని పరిస్థితిలో కీమోథెరపీ ఉపయోగడుతుంది. టి.ఎ.సి.ఇ విధానం, మైక్రోవేవ్‌ అబ్లేషన్‌ విధానాన్ని కూడా అనుసరించవచ్చు. అంటే సర్జరీతో పనిలేకుండా నేరుగా కణితిని గుర్తించి అబ్లేషన్‌తో చికిత్స చేయవచ్చు. ఈ పద్ధతిలో డే కేర్‌ ప్రొసిజర్‌తో చికిత్స చేయవచ్చు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాన్సర్‌కు పూర్తిస్థాయి చికిత్స సాధ్యపడుతోంది. వ్యాధి బాగా ముదిరిపోయిన కేసుల్లో నాణ్యమైన శేషజీవితాన్ని అందించడం సాధ్యపడుతోంది.


నివారణ మన చేతుల్లోనే...

కాలేయ వ్యాధుల నివారణకు ఆరోగ్యకరమైన అలవాట్లు, సమతుల ఆహారంతో కూడిన జీవనవిధానం మంచిది. మద్యపానానికి దూరంగా ఉండాలి. హెపటైటిస్‌ బి వ్యాక్సీన్‌తో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకోవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్లతో లివర్‌ సిర్రోసిస్‌, తదనంతర క్యాన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చు.

డాక్టర్‌ ఆర్‌.వి. రాఘవేంద్రరావు

సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌,

హైదరాబాద్‌

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 01:33 AM