అడవిని గెలిచిన ధీర
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:39 AM
అస్సాంలోని దట్టమైన అడవుల్లో ఏకే-47 పట్టి కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లను ముందుండి నడిపించి..
అస్సాంలోని దట్టమైన అడవుల్లో ఏకే-47 పట్టి కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లను ముందుండి నడిపించి..
బోడో తీవ్రవాద మూలాలను పటాపంచలు చేసిన శౌర్యమూర్తి సంజుక్త పరాశర్. సీఆర్‌పీఎ్‌ఫలో అత్యంత కఠినమైన జంగిల్ వార్‌ఫేర్ విభాగం ‘కోబ్రా’కి తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన ఆమె సేవలు భారత పోలీస్ వ్యవస్థలోనే ఓ సాహసోపేత అధ్యాయం.
అస్సాంలోని గువాహటిలో 1979 అక్టోబర్ 3న ఓ సామాన్య విద్యావంతుల కుటుంబంలో సంజుక్త జన్మించారు. ఆమె తండ్రి దులాల్‌చంద్ర బారువ అస్సాం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజినీర్ కాగా, తల్లి మీనాదేవి ఆరోగ్యశాఖలో సుదీర్ఘ కాలం పనిచేశారు. తల్లిదండ్రుల నుంచి అబ్బిన క్రమశిక్షణ, నిబద్ధత ఆమెను చిన్నతనం నుంచే ప్రత్యేకంగా నిలిపాయి. ఆమె పాఠశాల విద్య అస్సాంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో సాగింది. నిత్యం సైనిక అధికారుల పరేడ్లు, రక్షణ దళాల క్రమశిక్షణను కళ్లారా చూస్తూ పెరిగిన సంజుక్తలో దేశసేవ పట్ల ఆరాటం ఆ వయసులోనే బీజం వేసింది. స్కూల్, కాలేజీ రోజుల్లో ఆమె చదువుకే పరిమితం కాలేదు. ఈతలో ప్రత్యేక నైపుణ్యం సాధించడంతోపాటు క్విజ్ పోటీలు, నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శారీరక దృఢత్వం, సభా ప్రాంగణాల్లో నిలబడే మానసిక ధైర్యం ఆమెకు క్రీడలు, ఇతర కార్యకలాపాల నుంచే లభించాయి.
ఐపీఎస్ వైపే మొగ్గు
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంద్రప్రస్థ మహిళా కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన సంజుక్త.. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల విభాగంలో మాస్టర్స్, ఎం.ఫిల్ పూర్తిచేసి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. చదువు పట్ల ఆమెకున్న అంకితభావం చూసి ఆమె బోధన రంగాన్ని ఎంచుకుంటారని అందరూ భావించారు. కానీ, పుస్తకాల్లో చదివిన సిద్ధాంతాలకు క్షేత్రస్థాయిలో రూపమివ్వాలని, సమాజంలో ప్రత్యక్ష మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు సంజుక్త. 2006 యూపీఎస్సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 85వ ర్యాంకు సాధించారు. అయితే అనూహ్యంగా ఐఏఎ్‌సను కాదనుకుని ఐపీఎ్‌సను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం అస్సాం-మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నియామకమై తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.
‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’
2008లో అస్సాంలోని మకుమ్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సంజుక్త.. అతి తక్కువ కాలంలోనే తన వ్యూహాత్మక పరిపాలనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జోర్హాట్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో శాంతిభద్రతల సమస్యను అదుపుచేసి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఆమె సాహసానికి అసలైన పరీక్ష చిరాంగ్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎదురైంది. 2012 నుంచి 2015 మధ్య కాలంలో ఆ ప్రాంతంలో ‘నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్‌డీఎ్‌ఫబీ) తీవ్రవాద కార్యకలాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ముఖ్యంగా బోడో తీవ్రవాదులకు, స్థానిక బెంగాలీ ముస్లింలకు మధ్య చెలరేగిన వర్గ ఘర్షణలతో చిరాంగ్ జిల్లా అట్టుడికిపోయింది. వేలాదిమంది నిర్వాసితులయ్యారు. దట్టమైన అడవులు, ప్రాణాంతక భౌగోళిక పరిస్థితుల మధ్య ఎటువైపు నుంచి బాంబులు వచ్చి పడతాయో తెలియని పరిస్థితులు ఉండేవి.
అలాంటి క్లిష్ట సమయంలో ఆమె ఆఫీసుకే పరిమితం కాకుండా స్వయంగా దళాలను నడిపించారు. కామోఫ్లేజ్ మిలటరీ దుస్తులు ధరించి, చేతిలో ఏకే-47 రైఫిల్‌తో అడవుల్లో అడుగుపెట్టారు. వాహనాలు వెళ్లలేని దట్టమైన అటవీ ప్రాంతంలో పటాలంతో కలిసి మైళ్ల కొద్దీ కాలినడకన పర్యటించారు. 15 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆమె నాయకత్వంలోని ఆర్మీ, పారా మిలటరీ దళాలు జరిపిన ఆపరేషన్లలో 16 మంది కరుడుగట్టిన తీవ్రవాదులు హతమయ్యారు. మరో 64 మంది అరెస్టయ్యారు. భారీగా ఆయుధాలు, ఏకే సిరీస్ తుపాకులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను పునరుద్ధరించారు. ఈ వీరోచిత పోరాటంతోనే అస్సాం ప్రజలు ఆమెను ఆప్యాయంగా ‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’ అని పిలుచుకోవడం ప్రారంభించారు.

సామాజిక స్పృహ
యుద్ధ రంగంలో ఉగ్రవాదుల గుండెల్లో నిద్రపోయే సంజుక్త వ్యక్తిగత జీవితంలో అత్యంత నిరాడంబరంగా ఉంటారు. అస్సాంలో పనిచేస్తున్న సమయంలో దారితప్పి తీవ్రవాదం వైపు మొగ్గుచూపిన అనేకమంది యువకులకు, వారి కుటుంబాలకు స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిని తిరిగి ప్రజాజీవితంలోకి మళ్లించే పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. ప్రతికూల పరిస్థితులను జయించి కమాండో దళాల అత్యున్నత నాయకత్వం వరకు ఎదిగిన సంజుక్త జీవితం స్ఫూర్తిదాయకం.
ఎన్‌ఐఏ దర్యాప్తుల నుంచి ‘కోబ్రా’ వరకు
రాష్ట్రస్థాయిలో సంజుక్త చూపిన అసమాన వ్యూహాత్మక ప్రతిభ ఆమెను కేంద్ర సర్వీసుల వైపు నడిపించింది. 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)లో డీఐజీగా నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించి పలు ఉగ్రవాద వ్యతిరేక, ఉగ్రనిధుల మళ్లింపు కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. సంక్షిష్టమైన కేసుల్లో ఆధారాలు సేకరించడం, అంతర్జాతీయ లింకులను ఛేదించడంలో ఆమె చూపిన ప్రతిభ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. తాజాగా కేంద్రం ఆమెను సీఆర్‌పీఎఫ్ పరిధిలోని అత్యంత కఠినమైన జంగిల్ వార్‌ఫేర్ విభాగం ‘కోబ్రా’ (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్)కి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమించింది. నక్సలైట్లు, తీవ్రవాద నిరోధక వ్యూహాలను అటవీ ప్రాంతాల్లో అమలు చేసే ఈ అత్యంత ప్రమాదకర విభాగానికి నాయకత్వ బాధ్యతలు అందుకున్న మొట్టమొదటి మహిళా అధికారిగా సంజుక్త పరాశర్ రికార్డు సృష్టించారు. కఠిన శిక్షణ, శారీర దృఢత్వం, తక్షణ వ్యూహాత్మక నిర్ణయాలు అవసరమయ్యే దళానికి ఒక మహిళ నాయకత్వం వహించడం మహిళా సాధికారతకు నిదర్శనం.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు