Share News

విజయం అంటే..?

ABN , Publish Date - May 29 , 2026 | 01:50 AM

నదీ ప్రవాహంలో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. జీవితం కూడా నదిలాగానే ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రతి క్షణం కొత్తగా, తాజాగా ఉంటుంది. మీకు పీడకల వచ్చి మేలుకున్నప్పుడు...

విజయం అంటే..?

చింతన

నదీ ప్రవాహంలో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. జీవితం కూడా నదిలాగానే ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రతి క్షణం కొత్తగా, తాజాగా ఉంటుంది. మీకు పీడకల వచ్చి మేలుకున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయపడతారు. కానీ అది ఎక్కువ సేపు ఉండదు. జీవితంలో చెడు దశలు వస్తాయి. వాటిని పీడకలల్లా పరిగణించి ముందుకు సాగాలి. ఇలాంటి చెడు జ్ఞాపకాలను తొలగించడానికి, జీవితాన్ని కొత్తగా చూడడానికి ధ్యానం, శ్వాసతో అభ్యాసాలు మీకు కచ్చితంగా సాయపడతాయి. దేన్నయినా కొత్తగా ఆరంభించాల్సి వస్తే.. ఇప్పటికే ఆలస్యమయిందని ఎన్నడూ భావించకండి. కిందటి ఏడాది మీరు అనుభవించిన బాధ ఏదైనా... అది మీకు ఏదో ఒకటి నేర్పింది. అది మిమ్మల్ని మరింత బలవంతుల్ని చేసింది. మీ అంతర్‌ దృష్టిని మరింత లోతుగా మార్చింది. కాబట్టి గతానికి చెందిన భారాన్ని, సంకోచాలను వదిలించుకొని ముందుకు సాగండి.

వ్యక్తిత్వం... వైఫల్యం

మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలున్నాయి. మొదటిది... ఇక్కడ మీరు శాశ్వతంగా ఉండిపోరు. రెండోది... జీవితమంతా పూలబాటలా ఉండదు. పూల రేకులతోపాటు ముళ్ళు కూడా ఉంటాయి. గతంలో మీ దారిలో సవాళ్ళు ఎదురయ్యాయి. కానీ వాటిని అధిగమించారు. భవిష్యత్తులోనూ అంతే. మూడోది... జీవితాన్ని ఒక పెద్ద కోణంలో చూడండి. ప్రకృతిలో ప్రతిదీ ఇక్కడే ఉంటుంది. మీరు సృష్టించినవి కూడా ఇక్కడే ఉంటాయి. కానీ మీరు శాశ్వతంగా ఇక్కడ ఉండరు. అలాంటప్పుడు ఈ భూమిని ఎలా విడిచి వెళ్ళాలనుకుంటున్నారు? నిరాశ, నిస్పృహలతోనా? కాదు కదా! మీకు నచ్చని విషయాలు జరిగినప్పటికీ... అవి మిమ్మల్ని మరింత బలవంతులుగా, సున్నితమైనవారుగా, అంతర్‌ దృష్టి కలిగినవారుగా తీర్చిదిద్దుతాయి. అలాగే సానుకూలమైన విషయాలన్నీ జీవితం పట్ల మీకు విస్తృతమైన దృష్టిని అందిస్తాయి. కష్టసమయాలు మీలో ఉత్తమమైనదాన్ని బయటకు తీసుకువస్తాయి. ప్రతిఫలాన్ని అందించే సమయాలు... ప్రపంచంలో గొప్ప వాటిని మీకు అందిస్తాయి. జీవితమంటేనే వీటన్నిటి కలయిక. మీ ఉదాత్తమైన వ్యక్తిత్వంతో పోలిస్తే వైఫల్యం చాలా చిన్నది. అది మీ స్ఫూర్తిని మొత్తంగా కబళించలేదు, నాశనం చెయ్యలేదు.


షరతులు లేని ఆనందం

ప్రపంచంలో విజయం సాధించడం ఒకటైతే... జీవితంలో విజయం సాధించడం మరొకటి. ప్రపంచంలో విజయం సాధించినప్పటికీ జీవితంలో కూడా విజయం సాధించినట్టేనని చెప్పలేం. నా దృష్టిలో విజయం అంటే ఎలాంటి షరతులు లేని ఆనందం. మిమ్మల్ని మీరు నిరంతరం మెరుగుపరుచుకుంటున్నారా? ఎవరూ మీ నుంచి దూరం చెయ్యలేని చిరునవ్వు మీ ముఖంలో ఉందా? ఎప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మీలో ఉందా?... నేను వీటినే గమనిస్తాను. అవి మీలో ఉంటే... మీరు విజయం సాధించారని చెబుతాను. ఎలాంటి సందర్భంలోనైనా, మీ జీవశక్తిని ఉన్నతీకరించుకోవాలి. జీవశక్తి తక్కువగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. సవాళ్ళు అధిగమించలేనివిగా కనిపిస్తాయి. మీ సామర్థ్యం గురించి మీకు అవగాహన లేనప్పుడు బాధపడుతూనే ఉంటారు. సవాళ్ళు అనేవి ధైర్యాన్ని, కరుణను, చైతన్యాన్ని, ఉన్నతమైన ఒక ఆశయం పట్ల నిబద్ధతను ప్రేరేపించడానికి దోహదం చేస్తాయి. గతాన్ని విడిచిపెట్టండి. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి.

శ్రీశ్రీరవిశంకర్‌

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 01:50 AM